The Desk…Eluru : గుండుగొలను ఫుట్ ఓవర్ బ్రిడ్జి కి నిదులు మంజూరు…ఫలించిన ఎంపీ మహేష్ కుమార్ కృషి

The Desk…Eluru : గుండుగొలను ఫుట్ ఓవర్ బ్రిడ్జి కి నిదులు మంజూరు…ఫలించిన ఎంపీ మహేష్ కుమార్ కృషి

  • గుండుగొలను వద్ద వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు విడుదల.
  • పూర్తయిన టెండర్ ప్రక్రియ.
  • త్వరలో వంతెన నిర్మాణం పనులు ప్రారంభం

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన అవిరళ కృషి ఫలించింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే వంతెన నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఫలితంగా దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

ఏలూరు జిల్లా గుండుగొలను సమీపంలోని గరుడ హోటల్ వద్ద జాతీయ రహదారికి (ఎన్.హెచ్ 16) ఒకవైపు నుంచి మరోవైపు వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు మృత్యువాత పడగా మరికొందరు గాయాల పాలయ్యారు.

ఏలూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన పుట్టా మహేష్ కుమార్ దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకొచ్చారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ కి విజ్ఞప్తి చేశారు. పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు రాకపోకలు సాగించడానికి వీలుగా వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కోరుతూ కేంద్రమంత్రిని స్వయంగా కలిసి ఎంపీ మహేష్ కుమార్ వినతిపత్రం చేశారు. ఇక్కడ నెలకొన్న సమస్య తీవ్రతను ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు.

ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఎన్.హెచ్ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వంతెన నిర్మాణ పనులను గుత్తేదారుకు అప్పగించారు. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టి 3 నుంచి 6 నెలల వ్యవధిలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్.హెచ్ అధికారులు బదులిచ్చారు.

సమస్యను విన్న వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు ఎంపీ పుట్టా మహేష్ చేసిన కృషి పట్ల ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఏ ఎంపీ చేయని విధంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ పరిధిలో దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ప్రజలు ప్రశంసిస్తున్నారు.