దిల్లీ /ఏలూరు : THE DESK NEWS :
ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకుని, కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని ఇందిరా పర్యవరణ్ భవన్ లో కేంద్ర మంత్రిని ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
2025 జనవరి 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు సరస్సు ప్రాంతంలో దీర్ఘకాలికంగా నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్న విషయాన్ని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు జారీ చేసిన ఆదేశాలతో 122 గ్రామాలలోని రైతులు, ప్రజల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, తరతరాలుగా అక్కడి భూమిపై ఆధారపడిన మూడు లక్షల మందికి పైగా ప్రజల మనుగడను ప్రమాదంలో పడేసిందని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు.
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కొల్లేరు అభయారణ్యం ప్రాంతం నుండి 14,861 ఎకరాల ప్రైవేట్ భూములు, 7,102 ఎకరాల అసైన్డ్ భూములకు సరిహద్దులు పునరుద్ధరించాలని సిఫార్సు చేస్తూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్.బి.డబ్ల్యు.ఎల్) మంజూరు చేసిన వెసులుబాటును అమలు చేసే వీలు కల్పించాలని ఎంపీ మహేష్ కుమార్ వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఎన్‌బిడబ్ల్యుఎల్ మంజూరు చేసిన వెసులుబాటులో పొందుపరిచిన చిత్తడి నేల (పరిరక్షణ మరియు నిర్వహణ) రూల్స్, 2017 మరియు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ప్రకారం సరైన సరిహద్దులను నిర్ధారిస్తూ, సుప్రీంకోర్టుకు సవరించిన అఫడవిట్ ను ఫైల్ చేయమని సంబంధిత అధికారులను ఆదేశించాలని.. భూముల వాస్తవ స్థితి, బాధిత ప్రజల న్యాయమైన క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకోవడానికి సుప్రీంకోర్టుకు సవరించిన సమర్పణను దాఖలు చేయడానికి వీలుగా ఫిబ్రవరి నెలాఖరు వరకు కొల్లేరు ధ్వంసం ప్రక్రియపై స్టే కోరాలని కోరారు.
అలాగే.. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న మూడు లక్షల మందికి పైగా ప్రజలు వలసబాట పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం సమర్థవంతంగా అమలు చేసేలా సహకరిస్తూ.. కొల్లేరు ప్రాంత ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. కొల్లేరు ప్రాంత ప్రజల తరఫున తాను చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.