క్లీన్ ఎయిర్ కార్యక్రమం సమావేశంలో అధికారులకు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశం
ఏలూరు నగరంలో క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ. 2.16 కోట్లతో పనులకు ఆమోదం
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని వాయుకాలుష్యం కలిగిన నగరాలలో కాలుష్య నియంత్రణకు ప్రణాళికబద్దముగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. . వాటిలో ఏలూరు నగరం ఒకటన్నారు. ఏలూరు నగరంలో నానాటికీ పెరుగుతూ ప్రజారోగ్యానికి చేటు చేస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.
ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్దఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఏలూరు నగరంలో రహదారులు అంచులలో రోడ్ల నిర్మాణం లేని కారణంగా దుమ్ము, దూళికణాల ద్వారా వాయు కాలుష్యం వ్యాపిస్తున్నదని, దీనిని నివారించడానికి నగరంలోని రోడ్లు మార్జిన్లలో ఎండ్ టూ ఎండ్ వరకు రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నగరపాలక సంస్థ కమీషనర్ ని ఆదేశించారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు రూ 2. 16 కోట్ల రూపాయలతో పనులు చేపట్టుటకు సమావేశం ఆమోదించిందన్నారు. రూ. 75 లక్షల రూపాయలతో జిల్లా పోలీసు శాఖ వారు, 1. 31 కోట్ల రూపాయలతో వాయు కాలుష్య నియంత్రణకు ఏలూరు నగరపాలక సంస్థ ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణ, మరమ్మత్తు పనులను సమావేశం ఆమోదించింది. ఎలక్ట్రికల్, సి. ఎన్ .జి వాహనాలను ప్రజలు వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. వెంకటేశ్వరరావు, కన్సల్టెంట్ ఏ . కోమలి, సామజిక వన విభాగం జిల్లా అటవీ శాఖాధికారి కళ్యాణి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు,, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భాను ప్రతాప్, ఉప రవాణా కమీషనర్ షేక్ కరీం , రహదారులు భవనాల శాఖ ఈఈ కిషోర్ బాబూజీ, ప్రభృతులు పాల్గొన్నారు.