- చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగస్వామినవుతా
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
దిల్లీ /ఏలూరు : THE DESK NEWS :

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనలో మిగిలిన ఎంపీలతో కలిసి తాను కూడా భాగస్వామిని అవుతానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దిల్లీలోని ఏపీ భవన్ లో గురువారం జరిగిన సెమినార్ కు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తాను బీసీ సామాజికవర్గంలో పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, తాను బీసీని కావడం వల్లే ఈరోజు ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం లభించిందని తెలిపారు. తన కుటుంబం ఎంతో కష్టపడి ఈరోజు ఆర్థికంగా పైకి వచ్చిందని, తద్వారానే తనకు ఎంపీగా పోటీ చేసే వీలు కలిగిందని ఎంపీ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని తెలిపారు.
రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోయినా, తెలుసుకొని సార్వత్రిక ఎన్నికలకు 45 రోజుల ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిన ఏలూరు జిల్లా ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని ఎంపీ తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ప్రతి ఒక్కరూ ఒకటే అర్థం చేసుకోవాలని, ఈరోజు తమ పిల్లలను బాగా చదివిస్తేనే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉందని సూచించారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నతి చేరుకోవాలంటే చదువుకోవటం ఒక్కటే మార్గం అని, ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఎంపీ పేర్కొన్నారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధన, బీసీ కులగణనకు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు తన పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు.