- ఫిబ్రవరి10 వరకు నామినేషన్లు స్వీకరణ..
- ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్..
– జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి కోరారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరణ, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.
ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8.00 గం. నుండి సాయంత్రం 4.00 గం. వరకు పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పోలింగ్ ఉంటుందని, మార్చి 3వ తేదీన కౌంటింగ్ ఉంటుందన్నారు. మార్చి 8వ తేదీ నాటికి పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 440 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
వీటిలో 3,15,261 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అదే విధంగా ఈ ఎన్నికల నేపద్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు అందిన 8,501 క్లైయిమ్ లు అన్నింటిని పరిశీలించి ఫిబ్రవరి 5వతేదీ లోపు ఇఆర్ఓ నెట్ లో అప్ డేట్ చేయడం జరుగుతుందన్నారు. ఏలూరు డివిజన్ లో 8 మండలాల్లో 37 పోలింగ్ స్టేషన్లు, జంగారెడ్డిగూడెం డివిజన్ లో 10 మండలాల్లో 23 పోలింగ్ స్టేషన్లు, నూజివీడు డివిజన్ లో 2 మండలాల్లో 6 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 440 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటికి అనుబంధంగా 16 పోలింగ్ స్టేషన్లను ప్రతిపాధించడం జరిగిందన్నారు. అదే విధంగా కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజవర్గాలకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏఆర్ఓగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కింటి వ్యవహరిస్తారన్నారు. ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇందుకు సంబంధించి ఏలూరు జిల్లాలో 16,077 మంది ఓటర్లు ఉండగా వారిలో 9858 మంది పురుషులు, 6218 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జండర్ ఉన్నారన్నారు. ఇందుకు సంబంధించి 20 పోలింగ్ స్టేషన్లకు అధనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాధించడం జరిగిందన్నారు. 57 క్లైయిమ్ లు స్వీకరించడం జరిగిందన్నారు.
సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి,జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, నెరుసు నెలరాజు(బిజెపి), ఎస్. అచ్యుత బాబు, యు. బాలానందం, (టిడిపి), ఎస్. సత్యనారాయణ(సిపిఐఎం), సిర్రా భరత్(బిఎస్పీ), ఎస్. కె. భాషా (ఆమ్ ఆద్మీ), ఎస్. ఆదిశేషు(సిపిఎం) తదితరులు పాల్గొన్నారు.