The Desk…Eluru : 216 హెచ్ జాతీయ రహదారి అభివృద్ధికి నిధుల మంజూరుకు డీపీఆర్ లో చేర్చాం

The Desk…Eluru : 216 హెచ్ జాతీయ రహదారి అభివృద్ధికి నిధుల మంజూరుకు డీపీఆర్ లో చేర్చాం

  • ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు లేఖ ద్వారా తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఏలూరు జిల్లా పరిధిలో గల 216 హెచ్ జాతీయ రహదారిలో సర్వీస్ రోడ్, ఫ్లైఓవర్, కల్వర్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు డీపీఆర్ లో చేర్చినట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లేఖ ద్వారా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు తెలియజేశారు.

నూజివీడు నుంచి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారిలో మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణా చేసే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తుక్కులూరు నుంచి నూజివీడు మున్సిపల్ ఏరియా ముగింపు వరకు ఆరు కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డు కనెక్టివిటీ, తుక్కులూరు సమీపంలోని 69వ కిలోమీటరు వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం, భారీ వర్షాల సమయంలో పోటెత్తే వరదల వల్ల వ్యవసాయ భూములు కోతకు గురై రైతులు నష్టపోతున్నందున 70.465 కిలోమీటరు వద్ద ఉన్న కల్వర్టును కూల్చివేసి 70.385 కిలోమీటర్ వద్ద కల్వర్టు నిర్మించి వరదనీటి ప్రవాహాన్ని మళ్లించాలని ఎంపీ మహేష్ కుమార్ గత ఏడాది సెప్టెంబరు 25న రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారు.

216 హెచ్ జాతీయ రహదారిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను డీపీఆర్ లో చేర్చామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికలో నిధుల మంజూరు పరిశీలనలో ఉందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లేఖ ద్వారా ఎంపీ మహేష్ కుమార్ కు సమాధానం ఇచ్చారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.