The Desk…Eluru : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..!! ➖(MP)మహేష్ పుట్టా హామీ

The Desk…Eluru : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..!! ➖(MP)మహేష్ పుట్టా హామీ

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

కొల్లేరు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకువెళ్లి, న్యాయం చేసేందుకు తను వంతు కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయం ప్రతినిధులను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు యేసు రాజు, సత్యనారాయణ, బీకేఎం నాని, కొల్లి బాబి, తదితరులు కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలతో కూడిన సమగ్ర నివేదికను బుధవారం అందజేశారు.

అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు ఎంపీ మహేష్ కుమార్ కు ఫోన్ లో వివరించారు.

గతంలో చంద్రబాబు నాయుడు కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టనట్లు వ్యవహరించడం వల్ల కొల్లేరు సమస్య మొదటికొచ్చిందని పరిరక్షణ సమితి నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ…

ఇటీవల కైకలూరులో జరిగిన సమావేశంలో తీర్మానించిన వివరాలు, కొల్లేరు ప్రాంత ప్రజల అభిప్రాయాలను త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తానని ఎంపీ మహేష్ కుమార్ కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులకు భరోసా ఇచ్చారు.

అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి ఎమ్మెల్యేలతో కలిసి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విస్మరించడంతో ప్రస్తుతం ఆ ప్రాంతవాసులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకుందని ఎంపీ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహకారం కోరడంతో పాటు, న్యాయ పరంగా కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ స్పష్టం చేశారు. త్వరలోనే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు.