🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డును నాలుగులైన్ల జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నానని కొద్ది రోజుల కిందట ఉంగుటూరు, గొల్లగూడెంలో జరిగిన సీఎం సభలో చెప్పిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదిశగా ఢిల్లీలో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
గురువారం కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ను స్వయంగా కలిసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ రోడ్డును గ్రీన్‌ఫీల్డ్ హైవేగా లేదా నాలుగులైన్ల జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయవలసిందిగా కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో పాల్గొంటున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ను ఆయన కార్యాలయంలో కలిశారు. కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డు ప్రాధాన్యతను ఎంపీ వివరించారు.
వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు, క్వారీ పదార్థాలు మరియు ఇతర వస్తువులను రవాణా చేయడానికి ప్రధాన మార్గంగా ఉన్నప్పటీకి, ప్రస్తుత రహదారి చాలా ఇరుకుగా ఉండి, ట్రాఫిక్ పరిమాణం మాత్రం చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులకు, సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఈ రహదారిని విస్తరించవలసిన అవసరం ఉందని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ రహదారిని గ్రీన్‌ఫీల్డ్ హైవేగా లేదా నాలుగులైన్ల జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసినట్లయితే ఈ ప్రాంతం యొక్క మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి, జిల్లాలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీని పెంచి, సామాజిక ఆర్థిక వృద్ధికి చాలా ఉపయోగపడుతుందన్నారు.
వీలైనంత త్వరగా సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసి, సర్వే మరియు డీపీఆర్ తయారీని ప్రారంభించమని సంబంధిత అధికారులను ఆదేశించాల్సిందిగా ఎంపీ కేంద్రమంత్రిని కోరారు. ఈ సందర్భంగా భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలను మార్చడంలో మంత్రి నితిన్ గడ్కరీ చూపిస్తున్న దార్శనికతకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి, ఈ రహదారి నూతన ప్రతిపాదన అయినందున అధికారులతో చర్చించి వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలియచేశాయి.

