🔴 The Digital Desk :
జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను (FASTag annual pass ) తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు.దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు.
దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాజ్‌మార్గ్ యాప్‌తో పాటు NHAI, MoRTH వెబ్సైట్లలో ఈ లింక్ అందుబాటులోకి వస్తుందన్నారు. వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
టోల్‌ప్లాజాల వద్ద రద్దీని, వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని గడ్కరీ అన్నారు.ఒక్కో ట్రిప్‌నకు రూ.15 మాత్రమే! వార్షిక పాస్ వల్ల ఒక్కో ట్రిప్‌నకు అయ్యే సగటు ఖర్చు రూ.15 మాత్రమేనని గడ్కరీ వెల్లడించారు.
ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వారు కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ వార్షిక పాస్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కమర్షియల్ వాహనదారులు ఎవరైనా పాస్ తీసుకొనేందుకు ప్రయత్నిస్తే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే డీయాక్టివేట్ చేస్తామని కేంద్రం హెచ్చరించింది.
జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉండే టోల్‌ప్లాజాలకు మాత్రమే పనిచేస్తుందని కేంద్రం పేర్కొంది.ట్రిప్పు అంటే..? నితిన్ గడ్కరీ ఫాస్టాగ్ పాస్ గురించి ప్రకటించగానే చాలా మందిలో ఓ సందేహం తలెత్తింది.
ఒకసారి పాస్ తీసుకుంటే గరిష్ఠంగా 200 ట్రిప్పులు వినియోగించుకోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. ఇక్కడ ‘ట్రిప్’ నిర్వచనం గురించి చాలా మందిలో సందేహం నెలకొంది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఒక్కో టోల్‌ప్లాజాను దాటడాన్ని ఒక్కో ట్రిప్‌గా పేర్కొంటారు.
ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణించేటప్పుడు మధ్యలో నాలుగు టోల్గేట్లు దాటాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొస్తే ఎనిమిది ట్రిప్పులుగా పరిగణిస్తారు. ఆ లెక్కన పాస్ తీసుకుంటే ప్రతి టోల్ గేటు వద్ద సగటున రూ.15 చొప్పున చెల్లించినట్లు అవుతుంది.