కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం.
భవిష్యత్తులో పామాయిల్ పంటకు రెట్టింపు ధర రానుంది.
మంచి ప్రభుత్వాన్ని సుదీర్ఘ కాలం కొనసాగించాలి.
ఏలూరు జిల్లా : ధర్మాజీగూడెం : ది డెస్క్ :

చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కష్టాల నుంచి ప్రజలకు విముక్తి లభించిందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ అమలుచేసి ఛార్జీలు తగ్గించామన్నారు. చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెంలో 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ..
రైతు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోడ్లు, కరెంటు సమస్య ఎక్కడ ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కువగా సాగు చేస్తున్న పొగాకు పంట నుంచి రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్ళాల్సిన అవసరం ఉందన్నారు.
భవిష్యత్తులో విమాన ఇంధనంలో పామాయిల్ కలిపే రోజులు రానున్నాయని, అదే జరిగితే పామాయిల్ ధరలు రెట్టింపు అవుతాయని, కాబట్టి రైతులు పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో మొదలు కానున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.
మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రభుత్వం సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకునేందుకు గుజరాత్ రాష్ట్రమే ఉదాహరణ అన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 20- 30 ఏళ్ళు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా అవుతుందనటంలో సందేహం లేదన్నారు.
అంతకుముందు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జరిగిన 132/33 కె.వి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీతో పాటు జిల్లా మంత్రి కొలుసు పార్ధ సారధి, ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, ధర్మరాజు, మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందలపు రవి, ఇతర నేతలు పాల్గొన్నారు.

