🔴 తూగో : దేవరపల్లి : ది డెస్క్ :

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం–2026 (NRSM–2026) కార్యక్రమాలలో భాగంగా మంగళవారం దేవరపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవరణలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మానవత సేవ సమితి సంస్థ ప్రతినిధులు (ప్రెసిడెంట్, సెక్రటరీ) మరియు దేవరపల్లి పోలీస్ ఎస్.ఐ సుబ్రమణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవర్లు, ఆటో యూనియన్ డ్రైవర్లు, మినీ గూడ్స్ అసోసియేషన్ సభ్యులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటింపు, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం, బాధ్యతాయుతమైన వాహన నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే రహదారి ప్రమాదాలను నివారించడంలో ప్రతి డ్రైవర్ బాధ్యత కీలకమని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందని వివరించారు. రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.

ఈ విధమైన అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించి, ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. వెంకట రమణ, ఎం. రవికుమార్, జి. రామ్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి. ప్రణీత్ కుమార్, దేవరపల్లి పోలీస్ ఎస్.ఐ సుబ్రమణ్యం, మానవత సేవ సమితి ప్రతినిధులు కె. వెంకట రాజు, బి. సూర్యనారాయణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

