- ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడి
- ఎంపీ మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి.
దిల్లీ / ఏలూరు : THE DESK :
గడచిన 5 సంవత్సరాలలో సైబర్ మోసాలకు సంబంధించి అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందని..సైబర్ మోసాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై పార్లమెంట్ శీతకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) “క్రైమ్ ఇన్ ఇండియా” సైబర్ మోసాలకు సంబంధించిన నేరాలపై డేటాను సేకరిస్తుందని, NCRB డేటా ప్రకారం 2018 నుంచి 2022 వరకు సైబర్ మోసాలపై ఏపీలో 533 కేసులు నమోదు కాగా, 255 ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 56 కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ,ల (LEAs) ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాయని, సైబర్ స్టాకింగ్, సైబర్ వేధింపుల కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వ్యక్తులపై LEAలు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని మంత్రి బదులిచ్చారు.
భారతీయ న్యాయ సంహిత, 2023 (BNS) ప్రకారం వెంబడించడంపై మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు మొదటి నేరానికి జరిమానా, తదుపరి నేరారోపణలపై ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని, BNS కింద శిక్షలతో పాటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 మహిళలపై సైబర్ నేరాలకు శిక్షలు విధిస్తుందని, సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ ఏర్పాటు చేసిందని, అన్ని రకాల సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి 2019 ఆగస్టు 30న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in)ని ప్రారంభించిందని మంత్రి తెలిపారు.
ఆన్‌లైన్ సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో సహాయం పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ ‘1930’ అందుబాటులో ఉందని.. హెల్ప్ లైన్ నంబర్ గురించి అవగాహన కల్పించడానికి సంక్షిప్త సందేశాలు, ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ (CCPWC) పథకం కింద హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తుందని, 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్-కమ్-ట్రైనింగ్ లాబొరేటరీలు ఏర్పాటు చేయగా.. ఆర్థిక మోసాలను అరికడుతూ.. మోసగాళ్ల నుంచి కాపాడేందుకు ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ప్రారంభించినట్లు మంత్రి సమాధానం ఇచ్చారు.