ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ప్రశ్నకు లోక్ సభలో లిఖిత పూర్వకంగా బదులిచ్చిన మంత్రి
దిల్లీ / ఏలూరు : THE DESK :
కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు, అంత కంటే ఎక్కువ ఖర్చుతో రూ. 5.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 145 ప్రాజెక్టులను ఆమోదించిందని, వీటిలో రూ.2.84 లక్షల కోట్ల వ్యయంతో 78 నూతన గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, రూ.2.81 లక్షల కోట్ల వ్యయంతో 67 బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.
దేశంలో ఆయిల్, నేచురల్ గ్యాస్ కంపెనీల ద్వారా గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందని, ఈ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు అనుమతులు, ప్రాజెక్టుల స్థాపనలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి హర్దీప్ సింగ్ పూరి లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత చమురు, గ్యాస్ కంపెనీ బోర్డులు నిర్ణయం తీసుకుంటాయని, తద్వారా ప్రభుత్వ పాత్ర సులభతరం చేశామని, గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు వాటి స్వభావాన్ని బట్టి పర్యావరణం, అటవీ, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (CRZ), వన్యప్రాణుల క్లియరెన్స్ తీసుకోవాలని, భూ సేకరణ, మార్గం హక్కు (ROW), వినియోగ హక్కు (ROU), పేలుడు, భద్రతకు సంబంధించిన అనుమతులు తీసుకోవాల్సి ఉందని మంత్రి సమాధానం ఇచ్చారు.
2014 నుండి రూ.4.86 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయంతో మొత్తం 379 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, వీటిలో రూ.2.52 లక్షల కోట్ల వ్యయంతో కూడిన 225 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు కాగా, రూ.2.34 లక్షల కోట్ల వ్యయంతో కూడిన 154 బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఆయిల్ & గ్యాస్ CPSEల ప్రాజెక్ట్‌ల అమలు స్థితిని అంచనా వేయడానికి పటిష్టమైన ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్ కలిగి ఉందని, ఆన్‌లైన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్ (www.pariyojana.gov.in) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడం కోసం ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మంత్రి బదులిచ్చారు.