The Desk… Delhi : రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

The Desk… Delhi : రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

  • జాతీయ రైతు దినోత్సవం సదస్సులో వెల్లడించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

దిల్లీ /ఏలూరు : THE DESK :

రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం జరిగిన సదస్సుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలిచే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 90 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. ఏలూరు జిల్లాలో మెట్ట, మాగాణి, వాణిజ్య వంటి అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారని, రైతుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.

తాను ఎంపీగా విజయం సాధించిన అనంతరం పామాయిల్, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించినట్లు ఎంపీ వెల్లడించారు. ఎన్నికల సమయంలో పామాయిల్ టన్ను రూ.12 వేలు ధర పలకగా రూ.17 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటంతో ప్రస్తుతం రైతులకు రూ.20 వేలు పైచిలుకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎంపీ తెలిపారు.

పంట ఉత్పత్తిపై పరిమితి ఉండటం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని పొగాకు సాగు చేస్తున్న రైతులు ఎంపీగా గెలిచిన మరునాడే తన ఎదుట గోడు వెళ్ళబోసుకున్నారని, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పంట ఉత్పత్తి పరిమితిని ఎత్తి వేయించడం వల్ల పొగాకు రైతులకు రూ.110 కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఎంపీ స్పష్టం చేశారు.

పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించాలని ప్రస్తుతం 28 శాతం ఉన్న జీఎస్టీని 34 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, తద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున జీఎస్టీ పెంచవద్దని ఇప్పటికే తాను కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. త్వరలోనే దీనిపై పొగాకు బోర్డు చైర్మన్, కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.

ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్ అందించడంతో పాటు రాయితీపై విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. రైతులకు మరింతగా గిట్టుబాటు ధర కల్పించడానికి ఏలూరు జిల్లా పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.