The Desk…Bhimadole : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పల్లెల్లో ముందే వచ్చిన సంక్రాంతి సందడి : ఎంపీ పుట్టా మహేష్

ఏలూరు జిల్లా : భీమడోలు : THE DESK NEWS :

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి ముందే వచ్చిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

భీమడోలు మండలం గుండుగొలనులో రూ.25 లక్షలు, భీమడోలులో రూ.90 లక్షలు నరేగా నిధులతో చేపట్టిన సిమెంటు రహదారులు, వడ్డిగూడెంలో రూ.2.30 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్డును ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ శనివారం ప్రారంభించారు.

అనంతరం భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తరువాత మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సౌజన్యంతో ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా, ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పద్మశ్రీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్దే ధ్యేయంగా పెద్ద ఎత్తున పథకాల అమలు చేస్తుందని, దీనిలో భాగంగా గోకులం పథకంలో భాగంగా పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.

గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించారని ఎంపీ పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని రహదారులు సిమెంట్ రోడ్లుగా నూతన శోభను సంతరించుకుంటూ ఉన్నాయని ఎంపీ తెలిపారు. అలాగే గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధికినోచని ఆర్ అండ్ బి రహదారుల అభివృద్ధి కూడా రూ.97 కోట్లతో వేగవంతంగా జరుగుతుందని అన్నారు.

నిర్దిష్టమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రసంగించారు. కార్యక్రమంలో భీమడోలు సర్పంచ్ పాము సునీత, భీమడోలు పంచాయతీ కార్యదర్శి Kvl. తనూజ, నియోజకవర్గం పరిధిలోని కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.