The Desk…Bhimadole : రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే కూటమి ప్రభుత్వ సంకల్పం : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Bhimadole : రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే కూటమి ప్రభుత్వ సంకల్పం : ఎంపీ పుట్టా మహేష్

  • భీమడోలులో జరిగిన సుపరిపాలనకు ఏడాది మహాపాదయాత్రలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుతో కలిసి పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ :

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే ఆదర్శంగా నిలపాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో గురువారం జరిగిన సుపరిపాలనకు ఏడాది మహాపాదయాత్రలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, వైఎస్ఆర్ సీపీ నేతలు అసత్య ప్రచారం చేసిన ప్రజల నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల సాయం కింద తల్లుల ఖాతాలో రూ.8,745 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని, ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం వర్తింపజేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని ఎంపీ తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించిందని, దీపం-2 పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ.4 వేలు చొప్పున లబ్ధిదారులకు ఏటా రూ.34,000 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎంపీ వెల్లడించారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.9.34 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, తద్వారా 8.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఎంపీ తెలిపారు.

బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.47,456 కోట్లు కేటాయించి, ఏటా రూ.1000 కోట్లతో ఆదరణ-3 పథకం అమలు చేస్తుందని ఎంపీ వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, ప్రజలు భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వానికి ఇదే మద్దతు కొనసాగించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.