- గుండుగొలను వద్ద నిలిచిన వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎన్.హెచ్.ఏ.ఐ, ఐడబ్ల్యూఏఐ అధికారులు.
🔴 ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ :

ప్రభుత్వ శాఖల నడుమ కొరవడిన సమన్వయలోపంతో భీమడోలు మండలం గుండుగొలను వద్ద ఏలూరు కాలువపై అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులు కొలిక్కి తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టి సారించారు.

భీమడోలు మండలం గుండుగోలను వైపు వెళ్లే ప్రజలు వ్యతిరేక దిశలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుండుగొలను వద్ద ఏలూరు కాలవపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూ.3.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ అనంతరం నిర్మాణ పనుల బాధ్యతలు స్వీకరించిన గుత్తేదారు వంతెన నిర్మాణం ప్రారంభించారు.
అయితే ఏలూరు కాలవపై అనుమతి తీసుకోకుండా, తమ శాఖ మార్గదర్శకాల మేరకు వంతెన నిర్మాణం చేపట్టనందున తక్షణం పనులు నిలిపివేయాలని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా స్లాబ్ దశ వరకు చేరిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీంతో ప్రజలు వ్యతిరేక దిశలోనే జాతీయ రహదారి మీదుగా గుండుగొలను వైపు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజలు, నాయకులు సమస్యను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
తక్షణం స్పందించిన ఆయన ఇటీవల ఏలూరు శాంతినగర్ లోని తన కార్యాలయంలో ఎన్.హెచ్.ఏ.ఐ, ఐడబ్ల్యూఏఐ అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాలతో ఎన్.హెచ్.ఎ.ఐ టెక్నికల్ మేనేజర్ సాల్మన్ అన్సోవి, సైట్ ఇంజనీర్ సాయినాథ్, కన్స్ట్రక్టివ్ మేనేజర్ సోమేశ్, ఐడబ్ల్యూఎఐ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ శర్మ, జూనియర్ ఇంజనీర్ ఆర్.లోకేష్, ఎంపీ మహేష్ కుమార్ ఓఎస్డి రాఘవులు, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి గుండుగొలను వెళ్లి ఏలూరు కాలువపై నిలిచిన వంతెన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.
వంతెన అసంపూర్తిగా ఉండటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానికులు అధికారులకు వివరించారు. ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాలతో ఇక్కడికి వచ్చిన తాము సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు బదులిచ్చారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్న ఎంపీ మహేష్ కుమార్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాను ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను స్వయంగా కలిసి వంతెన నిర్మాణానికి అనుమతి కోరుతానని ఫోన్లోనే అక్కడ ప్రజలకు ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. తాము చెప్పిందే తడువుగా సమస్య పరిష్కారానికి తన వంతు అవిశ్రాంత కృషి చేస్తున్న ఎంపీ మహేష్ కుమార్ కు స్థానిక ప్రజలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.