The Desk…Avanigadda : జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కొల్లు రవీంద్ర

The Desk…Avanigadda : జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కొల్లు రవీంద్ర

  • ప్రజల కొనుగోలు శక్తి, పొదుపు పెరిగాయి
  • తగ్గించిన జీఎస్టీతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు, రైతులకు ప్రయోజనకరం
  • కాఫీ నుండి ట్రాక్టర్ వరకు అన్ని ధరలు తగ్గాయి

-అవగాహనా సదస్సులో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

కృష్ణాజిల్లా : అవనిగడ్డ : ది డెస్క్ :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం అవనిగడ్డ రెవెన్యూ హాలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోందన్నారు. గతంలో మాదిరిగా అమెరికాకు భయపడే పరిస్థితి ఇప్పుడు లేదని, తాజాగా అమెరికా పన్నులు పెంచడంతో, భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను ధైర్యంగా సద్వినియోగం చేసుకుంటోందన్నారు.

బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత ఆర్థిక ప్రయోజనాలు దేశ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టిని తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాల, రైతుల కొనుగోలు శక్తి, పొదుపు గణనీయంగా పెంచాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యవసర సరుకుల ధరలు, వ్యవసాయ పనిముట్ల రేట్లు తగ్గాయన్నారు.ఈనెల 16న జీఎస్టీ అవగాహన సదస్సుకు రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే మౌళిక సౌకర్యాల కల్పనకు గ్రామాల్లో విస్తృతంగా సీసీ రోడ్ల నిర్మాణం చేసిందన్నారు.

ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో పులిగడ్డ – పెనుమూడి బ్రిడ్జి నిర్మాణం టీడీపీ ప్రభుత్వం చేసిందని, ఇప్పుడు ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయానికి దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే క్షేత్రస్థాయి విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు.

తద్వారా సామాన్య, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. తగ్గిన జిఎస్టి ప్రకారం తగ్గిన ధరల వివరాల బోర్డులు కచ్చితంగా దుకాణాల ముందు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. దివిసీమ ఉప్పెన కంటే గత వైసిపి పాలనలో జరిగిన విధ్వంస దుష్పరిణామాలే అధికమన్నారు. కూటమి ఏర్పాటులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అని, అదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ విస్తృత సహకారం అందిస్తుండడంతో, ఎన్నికల ముందు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే అవకాశం కలిగిందన్నారు.

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విస్తృతంగా గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్న నరేంద్ర మోడీకి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకొని ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు జీఎస్టీ స్లాబులను మార్చి, పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులపై జిఎస్టి పన్నులను గణనీయంగా తగ్గించి మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యధిక మేలు చేకూర్చారన్నారు.

దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుతో పేదల విద్యా, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. తాజాగా అమలు చేసిన మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 16 వేలకు పైగా ఉద్యోగాలు వస్తే, తమ అవనిగడ్డ నియోజకవర్గంలోనే 275 మంది యువకులు ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు అందుకుని ఆయా కుటుంబాలకు అండగా నిలిచే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా తగ్గిన జీఎస్టీ వివరాల కరపత్రాలు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఏఎంసీ చైర్మన్లు కొల్లూరి వెంకటేశ్వరరావు, తోట కనకదుర్గ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు, బీజేపీ నియోజకవర్గ నాయకులు జీవీ నగరాయలు, టీవీ గిరి, స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు పైడిపాముల కృష్ణకుమారి, పైడిపాముల స్వప్న, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, పూషడపు రత్నగోపాల్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, ఏఎంసీ డైరెక్టర్ ఉప్పల ప్రసాద్, నీటి సంఘ అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు గుడిసేవ సూర్యనారాయణ, రేవు సువర్ణరాజు, మండలి రామ్మోహనరావు, మేడికొండ విజయ్, బాలు శ్రీనివాస్, గుగ్గిలం శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.