- అత్యవసర వైద్యసేవలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి
- ఆత్మకూరులో ఇప్పటివరకు 565మందికి రూ.5.72 కోట్లు మంజూరు
🔴 నెల్లూరు జిల్లా :ఆత్మకూరు : ది డెస్క్ :
పేదల ఆరోగ్యభద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, పేద,మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
మంగళవారం ఉదయం ఆత్మకూరు ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో 28 కుటుంబాలకు రూ.35.21 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబసభ్యులకు మంత్రి ఆనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ :
అత్యవసర సమయాల్లో మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేటు ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు పొందిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్షలాదిరూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంగా మంజూరు చేస్తున్నారని చెప్పారు.
ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో తమ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 565మందికి రూ.5.72కోట్లు మంజూరు చేసి ఆ కుటుంబాలకు అండగా నిలిచినట్లు చెప్పారు. పేదల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో పావని, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, కమిషనర్ గంగా ప్రసాద్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
మున్సిపాలిటీలోని అన్నివార్డుల్లో అభివృద్ధి పనులు
డ్రైన్లు, రోడ్లు ఏర్పాటుకు రూ.7.10 కోట్లు మంజూరు
డ్రైనేజీ, రహదారుల అభివృద్ధి నిరంతర ప్రక్రియ
సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు పట్టణంలో మంత్రి సుడిగాలి పర్యటన
ఆత్మకూరు మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పర్యటించారు. పలు కాలనీల్లో స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, పరిష్కరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. వార్డు కౌన్సిలర్లు, స్థానిక నేతల నుంచి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ:
ఆత్మకూరు మున్సిపాలిటీలో జరగాల్సిన అభివృద్ధి చాలా వుందని, ప్రణాళికాబద్ధంగా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వార్డుల్లో డ్రైనేజీ, రహదారుల వ్యవస్థ పటిష్టం కావాల్సి వుందన్నారు. విస్తరించిన ఆత్మకూరు శివారు ప్రాంతాల్లో కనీసం రోడ్లు, డ్రైన్లు కూడా లేవన్నారు. ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
డ్రైనేజీల నిర్మాణానికి రూ. 2కోట్లు, సిమెంటురోడ్లు నిర్మాణానికి రూ.5.10 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్నివార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుకు నిరంతరం కృషిచేస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి సోమశిల రోడ్డు వరకు నాలుగులైన్ల రహదారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 7 రహదారుల ఏర్పాటుకు 27 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అలాగే వీర్లగుడిపాడుకు రహదారి సౌకర్యం కల్పించి సంగం జాతీయరహదారితో అనుసంధానం చేసేలా బీరాపేరు వాగుపై 25 కోట్లు బ్రిడ్జి నిర్మాణం మంజూరైనట్లు చెప్పారు. త్వరలో ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నివేదికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పురపాలకశాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో పావని, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, కమిషనర్ గంగా ప్రసాద్, వివిధశాఖల అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

