The Desk…Atmakuru : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది : మంత్రి ఆనం

The Desk…Atmakuru : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది : మంత్రి ఆనం

🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :

రైతాంగం సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరులో జిల్లా స్థాయి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025-26 రెండవ విడత నగదు పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జేసి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో పావని, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి, రైతులు, ప్రజాప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, వై ఎస్ ఆర్ కడప జిల్లా, పెండ్లిమర్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయగా, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు వీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా 46.22 లక్షల మంది రైతులకు రూ. 3,077 కోట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమ చేశారని, జిల్లా స్థాయిలో 1,95,866 మంది రైతులకు రూ. 130.20 కోట్లు, ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది రైతులకు రూ. 22.95 కోట్లు లబ్ది చేకూరనుందని మంత్రి వివరించారు.

తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ, ఎన్నికల హామీ మేరకు రెండో విడత కూడా అన్నదాత సుఖీభవ నిధులను సీఎం జమ చేశారని చెప్పారు. రైతుసంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనమంతా తోడుగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం పిలుపునిచ్చారు.

సోమశిల హై లెవెల్ కెనాల్, ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి తో కలిసి కృషి చేస్తా : మంత్రి ఆనం

ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంత రైతుల కోసం సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను మొదలు పెట్టేందుకు, ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని మంత్రి ఆనం చెప్పారు. ఈ రెండు ప్రధాన సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి వీటి సాధనకు కృషి చేస్తామన్నారు.

సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తయితే మర్రిపాడు వరకు సోమశిల జలాలతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని, ఈ కాలువ ద్వారా 90 వేల మంది జనాభాకు తాగునీరు, 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి ఆనం చెప్పారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కష్టకాలంలో ఒక్కొక్క రైతుకు 7వేలు ఇవ్వడం శుభపరిణామంగా ఆయన చెప్పారు. సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని సీఎం ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు.తొలుత అన్నదాత సుఖీభవ… పీఎం కిసాన్ మెగా చెక్కును ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు.