The Desk…Atmakuru : ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలపై స్పందించిన మంత్రి ఆనం

The Desk…Atmakuru : ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలపై స్పందించిన మంత్రి ఆనం

  • జిల్లా కలెక్టర్, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
  • మంత్రి ఆనం ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం…. ఆత్మకూరుకు కదిలిన వైద్య బృందాలు
  • జిల్లావ్యాప్తంగా ఎటువంటి వర్షాకాల వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆనం ఆదేశం

🔴 నెల్లూరు : ఆత్మకూరు : ది డెస్క్ :

ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల కలకలంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు.

విష జ్వరాల సమాచారం తెలియగానే మంత్రి అధికారులను అప్రమత్తం చేసి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆదేశించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల ఘటనపై నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అన్నిస్థాయిల అధికారులతో మంత్రి అత్యవసరంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు.

మంత్రి ఆనం ఆదేశాలతో సమాయత్తమైన వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆత్మకూరు గురుకుల పాఠశాలకు తరలివెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ఆనం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

వైద్యులు జ్వరాల బారిన పడిన విద్యార్థినులకు సమీపంలో ఉండే జిల్లా వైద్యశాలకు తరలించి తక్షణ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జ్వరాల బారినపడిన విద్యార్థునుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, స్వచ్ఛమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం హెచ్చరించారు.