The Desk … Atmakur : రైతుల భూములకు పూర్తి చట్టబద్ధత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ➖ మంత్రి ఆనం

The Desk … Atmakur : రైతుల భూములకు పూర్తి చట్టబద్ధత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ➖ మంత్రి ఆనం

🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :

ఉప్పలపాడు గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి

కోటి మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు ఇవ్వడమే లక్ష్యం

విద్యుత్ చార్జీలను పెంచడం కాదు తగ్గిస్తున్నాం

సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం : మంత్రి ఆనం

రైతుల భూములకు పూర్తి చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పలపాడు గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

మంత్రి ఆనం మాట్లాడుతూ :

అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులను హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ప్రభుత్వ రాజముద్రతో, క్యూ ఆర్ కోడ్‌తో జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పూర్తిగా చట్టబద్ధత కలిగినవని తెలిపారు. ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు తక్షణమే కనిపిస్తాయని వివరించారు.
గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలకు, తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు మధ్య ఉన్న తేడాను రైతులకు సులభంగా అర్థమయ్యేలా మంత్రి వివరించారు.
గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానం, విలువ లేనివని, తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పాస్ పుస్తకాలు మాత్రం రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే కరెన్సీ నోట్ల మాదిరిగా పూర్తి విలువ, భద్రత, చట్టబద్ధత కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో 235 గ్రామాల్లో రీ సర్వే చేపట్టి గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాల స్థానంలో నూతన పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు ఇవ్వడమే లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. 2026 డిసెంబర్ నాటికి రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు, ప్రజలకు అండగా నిలుస్తామని మంత్రి ఆనం తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ కార్యక్రమాలపై మంత్రి మాట్లాడుతూ..

ఎవరూ ఊహించని విధంగా ఆరు ప్రధాన పథకాలను ప్రకటించి, వాటి ద్వారా 60కి పైగా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీకి ప్రభుత్వం రూ. 1144 కోట్లు చెల్లిస్తూ ఉచిత బస్సు – స్త్రీ నిధి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా రూ. 10 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశామని, అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు నాలుగు కోట్ల మందికి భోజనం అందించామని, కోట్లాది రూపాయలతో పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తున్నామని చెప్పారు.

అలాగే గ్యాస్ సంస్థలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తూ ప్రజలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండు విడతల్లో రూ. 6310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, త్వరలోనే మూడో విడత నిధులు కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ట్రూఅప్ చార్జీలను పూర్తిగా రద్దు చేశామని, విద్యుత్ ఛార్జీలను 29 పైసలు తగ్గించామని మంత్రి ఆనం పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఒక్క యూనిట్‌కు 1.27 రూపాయలు తగ్గిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచుకుంటూ పోతే తమ ప్రభుత్వం తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పావని, సర్పంచ్ ప్రశాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.