- గిన్నిస్ రికార్డుల కుటుంబం..
- చైనాలో స్థిరపడ్డ అనకాపల్లి వాసుల ఘనత..
అనకాపల్లి : THE DESK NEWS :
ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ ‘గిన్నిస్‌బుక్’లో స్థానం సంపాదించారు. నలుగురికీ స్ఫూర్తినిచ్చే దీక్ష, పట్టుదలగల ఆ కుటుంబం ప్రస్తుతం చైనాలో ఉంటోంది. జిల్లా కేంద్రమైన అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్‌కి నృత్యం అంటే ఎంతో ఇష్టం. కొన్నాళ్లు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. యోగాలోనూ ప్రావీణ్యం సంపాదించారు. విజయ్ భార్య జ్యోతి కూడా యోగాలో సాధన చేశారు. 2014లో చైనాకు వెళ్లి.. అక్కడ యోగా, డ్యాన్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యోగాలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.
2012లో విజయ్ అష్టవక్రాసనం 22 నిమిషాలు, మయూరాసనం 2 నిమిషాలు, బాకాసనం 3 నిమిషాలపాటు వేసి తొలుత గిన్నిస్‌బుక్ రికార్డు సాధించారు.
ఆ స్ఫూర్తితో జ్యోతి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అత్యధిక యోగాసనాలు వేయడం, కూర్మాసనాన్ని ఏకధాటిగా 10 నిమిషాలు వేసి గిన్నిస్ రికార్డులో తన పేరు నమోదు చేసుకున్నారు.
వీరి 14 ఏళ్ల కుమార్తె జస్మిత ఒంటికాలితో నిమిషానికి 160 సార్లు స్కిప్పింగ్ చేసి 2024 జూన్‌లో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించారు.
ఐదేళ్ల కుమారుడు శంకర్ ట్రాంపొలిన్‌పై ఎగురుతూ నిమిషానికి 129 సార్లు స్కిప్పింగ్ చేసి ఈ ఏడాది నవంబరులో రికార్డు సాధించారు.