పీఎన్జీ కనెక్షన్లు పెరగాలి… ఆయిల్ కంపెనీలు లక్ష్యం చేరుకోవాలి
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం
శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైపు లైన్ పనుల పూర్తికి కేంద్రం మంత్రికి సీఎం ఫోన్
అమరావతి : ది డెస్క్:
యుద్దాల నేపథ్యంలో తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీపం పథకం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.
దీపం పథకం లబ్దిదారులు పీఎన్జీకి మారితే… వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని… దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ది పొందవచ్చన్న విషయంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని… ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లో చేరుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని తెలిపారు. డొమస్టిక్ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని… త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తామన్నారు. శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు.
దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో… సమీక్ష నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

