The Desk … Amaravati : ‎కొల్లేరు సమస్యపై లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చలు‎

The Desk … Amaravati : ‎కొల్లేరు సమస్యపై లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చలు‎

🔴 ఏలూరు జిల్లా : అమరావతి : ది డెస్క్ :

ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన అనంతరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ కార్యాలయం, లోకేష్ తో భేటీలో ఎంపీ కొల్లేరు సమస్య ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.

గత కొన్ని రోజులుగా కొల్లేరు గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎంపీ లోకేష్ దృష్టికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. అక్రమ చెరువులను ధ్వంసం చేసేందుకుగాను ఇటీవల అటవీ శాఖ అధికారులు కైకలూరు మండలం చటాకాయి, వడ్లికూటితిప్ప, కొల్లేటికోటతో పాటు మరికొన్ని గ్రామాల్లో పర్యటించడం, దీనిపై అక్కడి ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయిన విషయాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.

అంతేకాకుండా రైతులంతా కలిసి అటవీ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధపడుతున్న విషయాన్ని కూడా లోకేష్ తో చర్చలో ఎంపీ ప్రస్తావించారు. ఈ చేపల చెరువులపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు ఒకపక్క, పర్యావరణ పేరుతో అటవీ శాఖ అధికారులు మరో పక్క మోహరించడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ఎంపీ వివరించారు.

కొల్లేరు రైతుల తరపున తాను ఇప్పటికే సుప్రీంకోర్టులో అడ్వకేట్ లను నియమించి, గట్టి వాదనలు వినిపిస్తున్న విషయాన్ని లోకేష్ కు గుర్తు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రస్తుత పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు మరింత దూకుడుగా వెళ్ళకుండా నియంత్రించే అవకాశాలపై లోకేష్ తో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పిన విషయాలన్నీ సావధానంగా విన్న లోకేష్ ఈ విషయాలను ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల పరిష్కారం సాధించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.