ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం
గ్లోబల్ బ్రాండ్‌గా నిలుస్తోన్న తెలుగు సినిమాలు
ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరిస్తాం
అమరావతి : ది డెస్క్ :
సినిమా షూటింగ్‌లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీకి కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ముంబయి జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025’ లో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు.
ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరించడానికి వేగంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇది ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక విజనరీ డాక్యుమెంట్ అని అభివర్ణించారు.భారతదేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
తెలుగు సినిమా – గ్లోబల్ బ్రాండ్ :మంత్రి కందుల దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… హిందీ తర్వాత భారతదేశంలో తెలుగు సినీ పరిశ్రమ రెండవ అతిపెద్దదిగా నిలిచిందన్నారు. ఇది జాతీయ చలనచిత్ర పరిశ్రమకు దాదాపు 20% వాటాను అందిస్తోందని స్పష్టం చేశారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ, పుష్ప సిరీస్ లు, సలార్, ఓజీ’ వంటి ప్రపంచ స్థాయి సినిమాలు కథాకథనం, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ నాణ్యతలో అద్భుతంగా ఉండి బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసి తెలుగు సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిచాయని, తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాయని తెలిపారు. చేశాయన్నారు.తమిళనాడు తర్వాత అత్యధికంగా ఏపీలో 1,103 స్క్రీన్లు ఉన్నాయని, ఈ రంగానికి తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల పనురుద్ధరణ :మంత్రి కందుల దుర్గేష్
భారతదేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగ భవిష్యత్తు శక్తివంతంగా ఉందని, డిజిటల్‌గా, ప్రపంచవ్యాప్తంగా తమ రంగం విస్తరించి ఉందని ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఈ పరివర్తనలో ముందంజలో ఉండటానికి కృతనిశ్చయంతో ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు పరిశ్రమను బలోపేతం చేసేందుకు సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక స్టూడియోలు, డబ్బింగ్ మరియు రీ-రికార్డింగ్ సౌకర్యాలు నిర్మించే వెంచర్లకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసానిచ్చారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వ, బహిరంగ ప్రాంతాల్లో అనుమతులు వేగంగా, పారదర్శకంగా, అవాంతరాలు లేకుండా లభిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను త్వరలో పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
ఏపీలో పెట్టుబడి పెట్టడం వల్ల విస్తృత ప్రయోజనాలు : మంత్రి కందుల దుర్గేష్
భారతీయ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ (M&E) రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ముఖ్య ప్రయోజనాలను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘పరిశ్రమ హోదా’ కల్పించడం వల్ల అన్ని రకాల రాయితీలకు త్వరితగతిన అర్హత లభిస్తుందని స్పష్టం చేశారు. 2029 నాటికి ₹25,000 కోట్లు ($3 బిలియన్లు) ప్రైవేట్ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఇప్పటికే దాదాపు ₹24,000 కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్‌ను కలిగి ఉందని, మరో ₹6,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతులు లభించాయని వివరించారు. వేగంగా పెరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్ ను తీర్చేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 3500 గదులను 50 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదే విధంగా భూమి కొనుగోలు/లీజుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ మరియు అర్హత కలిగిన పర్యాటక ప్రాజెక్టులకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపును అందిస్తున్నామన్నారు. అంతేగాక ప్రాజెక్ట్ స్థాయిని బట్టి 15 సంవత్సరాల వరకు 100 శాతం స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఎస్జీఎస్టీ) రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తున్నామని, ఇది నిరంతర ఆదాయ ప్రయోజనాన్ని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు 25% వరకు మరియు భారీ/మెగా ప్రాజెక్టులకు 10% వరకు ప్రత్యక్ష మూలధన రాయితీలు అందుబాటులో ఉన్నాయని, ఇవి ప్రారంభ పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని వివరించారు. అంతేగాక హాస్పిటాలిటీ యూనిట్లకు పారిశ్రామిక రేట్లకే విద్యుత్ అందించబడుతుందని, విద్యుత్ సుంకం నుండి ఐదేళ్ల మినహాయింపు ఉంటుందని తద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు.
AI, VFX, గేమింగ్ వంటి రంగాలకు ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం :మంత్రి దుర్గేష్
ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ‘స్వర్ణాంధ్ర విజన్’ తమ లక్ష్యమని మంత్రి దుర్గేష్ తెలిపారు. AI, VFX, గేమింగ్ వంటి రంగాలకు ఏపీని గ్లోబల్ హబ్‌గా (‘ఆంధ్రా వ్యాలీ’) మార్చేందుకు భారీగా పెట్టుబడి పెడుతున్నామని వెల్లడించారు. బీచ్‌ల నుండి నదుల వరకు , తీర్థయాత్రల నుండి హిల్ స్టేషన్ల వరకు ఆంధ్రప్రదేశ్ సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వాల అద్భుతమైన మిశ్రమాన్ని అందిస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. విశాఖపట్నం, భీమునిపట్నం మరియు కాకినాడ వంటి స్వచ్ఛమైన బీచ్‌ల నుండి గోదావరి మరియు కృష్ణ నదుల సుందరమైన తీరాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గధామం అని పేర్కొన్నారు.
తిరుపతి, శ్రీశైలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారని, “ఆంధ్రా కాశ్మీర్”గా పిలువబడే అరకు లోయ, లంబసింగి వంటి చల్లని హిల్ స్టేషన్లకు ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివచ్చి ఆస్వాదిస్తారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, శ్రీశైలం, అరకు లోయ, రాజమండ్రి, గండికోటలను ప్రధాన యాంకర్ హబ్‌లను అభివృద్ధి చేస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన “హబ్-అండ్-పోక్” మోడల్ ద్వారా అడ్వెంచర్, ఎకో, టెంపుల్, ఫిల్మ్ టూరిజం వంటి 21 థీమాటిక్ సర్క్యూట్‌లలో విభిన్నమైన పెట్టుబడి మార్గాలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ తరుణంలో ప్రపంచ పర్యాటక ప్రచారానికి సినిమాలు అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా భావించి సినిమా,సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో పాటు తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.ప్రత్యేకించి సినిమాటోగ్రఫీని ఉపయోగించి ఏపీ అందాలను ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక విజన్ స్పష్టంగా ఉంది: మంత్రి కందుల దుర్గేష్
సుస్థిరమైన పద్ధతులు అవలంభించి పర్యాటకులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో సినిమాటోగ్రఫీ, చారిత్రక వారసత్వాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.సుందరమైన లొకేషన్లు, పరిశ్రమ ప్రతిభ, గ్లోబల్ హిట్స్ తమ వద్ద ఉన్నాయని, ఫిల్మ్ టూరిజంలో విస్తృతమైన అవకాశాలున్నట్లు తెలుపుతూ సినిమా రంగంలో ప్రపంచ స్థాయి స్టూడియోలు, డబ్బింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు.
కొత్త ఫిల్మ్ పాలసీ ఈ క్లిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనకు రివార్డ్ ఇచ్చేలా ప్రత్యేకంగా రూపొందించబడిందని, స్టూడియోలు, సపోర్ట్ సర్వీసులలో పెట్టే పెట్టుబడులకు పోటీతత్వ ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.అదే విధంగా కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా నిజమైన ‘నాలెడ్జ్ ఎకానమీ’ని నిర్మించడానికి, గ్లోబల్ థింకర్స్ మరియు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము ఉత్సాహంగా పనిచేస్తున్నామన్నారు. ఈ క్రమంలో మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అధిక-విలువైన మేధో సంపత్తిని ఆకర్షించి తమ సృజనాత్మక అవుట్‌పుట్ ప్రపంచ స్థాయిలో పోటీపడేలా, దక్షిణ భారతీయ కంటెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే గేట్‌వేగా ఉండాలని భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ వేదికగా వెల్లడించారు.
సుస్థిరమైన, పారదర్శకమైన, వ్యాపార అనుకూలమైన పరిపాలన ఏపీ వ్యవస్థకు పునాది అని బాధ్యతాయుతమైన తమ విజన్ ను నమ్మే ప్రతి పెట్టుబడిదారుడికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు కల్పిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. భారతీయ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని $100 బిలియన్ల స్థాయికి చేర్చడంలో కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.
సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ లో భాగంగా మత్రి కందుల దుర్గేష్ ఉదయం సీఐఐ అధికారి సంజయ్ కత్వానీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రస్తుత ఏఐ యుగంలో మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ రంగం యొక్క భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించే ప్రతిష్టాత్మక చర్చలో సీఐఐ జాతీయ మండలి సభ్యులు రాజన్ నవాని తో పాటు సోనీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ హెడ్ నచికేత్ పంత్వైద్య, ఐబీడీఎఫ్ సెక్రటరీ జనరల్ అవినాష్ పాండే,షెమారో ఎంటర్ టైన్ మెంట్ సీఈవో హిరెన్ గడా, రేడియో మిర్చి సీఈవో యతీష్ మెహ్రిషి, జేడ్ల్యూ మారియట్ వ్యవస్థాపకులు, సీఈవో బిరెన్ ఘోష్ లతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం మంత్రి దుర్గేష్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట లు కలిసి యూట్యూబ్(ఇండియా) ఎండీ గుంజన్ సోనితో కలిసి చర్చించారు. సినిమా రంగ మౌలిక సదుపాయాల బలోపేతంపై క్యూబ్ సినిమా ఫౌండర్ సెంథిల్ కుమార్, కేంద్ర సమాచార, ఫిల్మ్, బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రటరీ డా. అజయ్ నాగభూషణ్, భారతీయ నటులు, నిర్మాత ప్రొసెంజిత్ ఛటర్జీ, స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ కె. రవి, ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభయ్ కుమార్ సిన్హా తదితర ప్యానలిస్ట్ లకు టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట ఫీచర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అదే విధంగా బేసిక్ ప్లై స్టూడియో, పాప ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, పిక్చర్ పర్ ఫెక్ట్, రాలెట్టా, కల్పవన స్టూడియోస్ ప్రతినిధులతో, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్ మెంట్ పార్క్స్ ఇండస్ట్రీస్ సెక్రటరీ జనరల్ అనిల్ పాద్వాల్, ఇమాజికా వరల్డ్ సీఈవో ధిమంత్ భక్షి, డొమెస్టిక్ బిజినెస్ అండ్ మైస్, థామస్ కుక్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆమన్ మహజన్ తదితర ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయిన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.

