🔴 అమరావతి : సచివాలయం : ది డెస్క్ :
కొల్లేరు ప్రజల సమస్యలను మానవీయ కోణంతో పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇంచార్జ్ శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
కొల్లేరు ప్రజల సమస్యలపై జిల్లాకు చెందిన రాష్ట్ర గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయంలోని ఇంచార్జ్ మంత్రి ఛాంబర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్థసారధి , ఎమ్మెల్యే లు తమ సమస్యలు తెలియజేస్తూ కొల్లేరు అభయారణ్యం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల త్రాగునీరు, రహదారులు, తదితర ప్రాధమిక సౌకర్యాలు ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు నిబంధనల పేరుతో అడ్డుపడుతున్నారని, జిల్లా సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాకుండా కొల్లేరు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… కొల్లేరు ప్రాంతంలోని ప్రజలపై మానవీయకోణంతో పరిశీలించాలని సుప్రీం కోర్ట్ ఏర్పాటుచేసిన కేంద్ర సాధికారిక కమిటీ దృష్టికి తీసుకువెళ్లి కోరడం జరిగిందన్నారు. జిల్లాలో కొల్లేరు, అటవీ భూముల సరిహద్దులకు సంబందించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని, అటవీ, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ… నూజివీడు నియోజకవర్గంలో అటవీ భూములకు సంబంధించి సరిహద్దుల సమస్య ఉందని, రెవిన్యూ, ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి సరిహద్దులు నిర్ణయించాలన్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు సంబందించి రైతులకు పట్టాలు జారీ చేయాలనీ, వారి భూములలో సాగుచేసుకునేందుకు బోర్ వెల్స్ వేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనుమతి మంజూరు చేయాలన్నారు. కొల్లేరు, నూజివీడు నియోజకవర్గంలో అటవీ సమస్యలపై తీసుకుంటున్న చర్యలను అటవీ శాఖాధికారులు సంబంధిత ప్రజలప్రతినిధులకు తెలియజేయాలన్నారు.
కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ… కొల్లేరులోని లంక గ్రామాలలోని ప్రజలు త్రాగునీటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు అద్వాన్న పరిస్థితులలో ఉన్నాయని, కొల్లేరు ప్రజల సమస్యలను మానవతా దృక్పధంతో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ… మొండికోడు రోడ్డు మరమ్మత్తులకు అనుమతి మంజూరు చేయాలనీ కోరారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ… ఉంగుటూరు నియోజకవర్గంలోని 64 నోటిఫైడ్ డ్రైన్ల మరమ్మత్తులకు త్వరితగతిన మంజూరు చేయాలనీ, డ్రైన్లను ప్రతీ ఏటా దేసిల్టింగ్ చేయించాలన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ… ఏలూరు లో ప్రస్తుతం ఉన్న నగరవనంకు ప్రత్యామ్నాయంగా వేరే విశాల ప్రదేశంలో ఏర్పాటు చేయవలసిందిగా అటవీ శాఖ వారిని కోరడం జరిగిందని, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు.
పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ విషయంలో నిర్వాసితులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వచ్చిన సమస్యలను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ… వెదురు మొక్కల పెంపకానికి మొక్కలను పంపిణీ చేయవలసిందిగా కోరారు.
మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యేలు తెలియజేసిన సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ… ప్రజాప్రతినిధులు తెలియజేసిన సమస్యలపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని, సదరు సమావేశానికి సమస్యలపై పరిష్కార చర్యలతో కూడిన పూర్తిస్థాయి నివేదికలతో అటవీ, ఇరిగేషన్, రెవిన్యూ ఉన్నత స్థాయి, జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. చింతలపూడి నియోజకవర్గంలో అటవీ భూముల సమస్యలపై అటవీ శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.