The Desk…Amaravati : ఏలూరులోని రెండు ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి సారింపు

The Desk…Amaravati : ఏలూరులోని రెండు ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి సారింపు

  • ప్రమాదకర పరిస్థితుల్లో… పవర్ పేట రైల్వే అండర్ బ్రిడ్జి – జూట్ మిల్ ఫ్లై ఓవర్

వినతి పత్రాలను స్పీకర్ కు అందించిన ఎమ్మెల్యే చంటి

🔴 అమరావతి/ ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 1టౌన్‌, 2టౌన్‌ ప్రాంతాలను కలుపుతూ గతంలో నిర్మాణమైన రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, దీని నిర్మాణానికి అవసరమైనన్ని నిధులను కేటాయించాలని ఏలూరు కు చెందిన సామాజిక సేవా కార్యకర్త BKSR అయ్యంగార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకురాగా ఈ విషయమై ఏపి శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు.

అలాగే సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఏలూరు జ్యూట్‌మిల్లు వద్ద ఉన్న ప్లైఓవర్‌ బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, దీని మరమత్తుల నిమిత్తం పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలని సీనియర్ సివిల్ ఇంజినీర్ M.చంద్ర శేఖర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకురాగా ఆ విషయాన్ని కూడా ఆయన స్పీకర్‌ను కోరారు. ఏలూరు నగరాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే బడేటి చంటి రెండు ప్రధాన సమస్యలపై దృష్టిసారించారు.

నేరుగా ఈ అంశాలను స్పీకర్‌ దృష్టికి తీసుకువెళ్ళి సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకునేందుకు లేఖలు అందించారు. శుక్రవారం రాష్ట్ర శాసన సభా సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి ఈ మేరకు రెండు వినతిపత్రాలను స్పీకర్‌కు అందజేశారు.

1: పవర్ పేట లోబ్రిడ్జి : ఏలూరు 1టౌన్‌, 2టౌన్‌ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటుచేసిన పవర్‌ పేట లోబ్రిడ్జికి అత్యవసర మరమత్తులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి 25సంవత్సరాలకు పైగా అవుతోందని, ముఖ్యంగా ఈ బ్రిడ్జి ప్రాంతంలో నీరు నిలిచిపోయి ఉండడం వల్ల ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఈ బ్రిడ్జి ద్వారా ప్రయాణించే వారు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని, నీరు నిలిచిపోవడం వలన ఆ ప్రాంతం నాచుపట్టి వాహనాలు జారిపోయి ప్రమాదాలు నెలకొంటున్నాయన్నారు.

ఈ ప్రాంతంలో నిలిచిపోయే నీటిని, మట్టిని తొలగించేందుకు ప్రతిరోజు రాత్రి, పగలు కార్పొరేషన్‌ సిబ్బంది పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. వాహనాలు ప్రమాదాలకు గురై ఎంతోమంది గాయాలపాలు కావడవంతో పాటు కొన్ని సందర్భాల్లో నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు లోబ్రిడ్జిలో నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోబ్రిడ్జి ప్రాంతంలో తక్షణ మరమత్తులు చేపట్టడంతో పాటు అత్యావసరంగా కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే ఈ లోబ్రిడ్జికి తక్షణ మరమత్తులు చేపట్టని నేపథ్యంలో విపత్కర పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, డాక్టర్‌ రమణారావుల బృందం హెచ్చరించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే నిత్యం 4వందల వరకూ రైళ్ళు ఈ లోబ్రిడ్జి పైనుండి ప్రయాణిస్తుంటాయని, అనుకోని పరిస్థితులు తలెత్తితే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఏలూరు కార్పొరేషన్‌కు సమృద్దిగా నిధులు లేనందున సంబంధిత శాఖ అధికారులు ఈ మరమత్తులు, అత్యవసర పనులు చేపట్టేందుకు వీలుగా భారీ నిధులు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడును కోరారు.

2) జ్యూట్‌మిల్లు ప్లైఓవర్‌ బ్రిడ్జి : ఏలూరులోని జ్యూట్‌మిల్లు ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించి 50యేళ్ళు అవుతోందని, సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం వలన ప్రస్తుతం ఈ బ్రిడ్జి కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఎమ్మెల్యే స్పీకర్‌కు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించడంతో పాటూ ఫుట్‌పాత్‌లను కూడా పునర్నిర్మించాల్సి ఉందని చెప్పారు.

నిలిచిపోయిన నీరు కారుతూ ఉండడం వలన ఇంటర్నల్‌ గిడ్డర్స్‌, ఆర్‌సిసి స్ట్రక్చర్లు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖాధికారులు సాంకేతిక పరీక్షలు నిర్వహించి ప్లైఓవర్‌ బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, ఈ బ్రిడ్జి మీదుగా భారీగా ప్రయాణాలు సాగుతుంటే బ్రిడ్జి ఏక్షణంలోనైనా కృంగిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించినట్లు తెలిపారు.

ఏలూరు నగరానికి సంబంధించి 1టౌన్‌, 2టౌన్‌ ప్రాంతాలకు జీవనాధారంగా నిలుస్తూ నిత్యం 4లక్షల మందికి పైగా ప్రయాణించడంతో పాటూ వేలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. బ్రిడ్జి విషయంలో అనుకోని పరిణామాలు సంభవిస్తే ఏలూరు నగరంలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం పొంచివుందని ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి బ్రిడ్జికి అత్యవసర మరమత్తులు చేపట్టి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా చూడాలని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుకు అందజేసిన లేఖలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు.