The Desk…Amaravati : మంత్రి ఆనం కు ఆహ్వాన పత్రిక

The Desk…Amaravati : మంత్రి ఆనం కు ఆహ్వాన పత్రిక

🔴 అమరావతి : ది డెస్క్ :

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా వైభవంగా జరిగే శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహించేందుకు దాదాపు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈరోజు నవరాత్రి ఉత్సవాల ఆహ్వానపత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనానాయక్, ఆలయ ప్రధాన అర్చకులు మరియు అర్చక బృందం కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి అందజేశారు.తరువాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు గురించి అధికారులు, అర్చక బృందం నుండి సమగ్ర సమాచారం సేకరించారు.

భక్తులు భారీగా విచ్చేసే దృష్ట్యా, వారి భద్రత, సౌకర్యాలు, శ్రద్ధాభక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం మంత్రి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనానాయక్, ఇతర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గిరిప్రదక్షిణ మార్గం, క్యూలైన్ వ్యవస్థ, వైద్యశిబిరాలు, తాగునీరు, శానిటేషన్, రవాణా సౌకర్యాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి తగు మార్గదర్శకాలు జారీ చేశారు.

మంత్రి ఆనం మాట్లాడుతూ… “విజయవాడలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోత్సవాలు అని కొనియాడారు. ప్రతి భక్తుడు అమ్మవారి ఆశీర్వాదం సులభంగా పొందేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది అని తెలిపారు.

అలాగే మూల నక్షత్రం రోజున విజయదశమి నాడు ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇతర ప్రాంతాలనుంచి భక్తులకు రవాణా ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ నవరాత్రులు సకల జనులకు శ్రేయస్సు, ఆనందం కలిగించాలి” రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.