The Desk…Amaravati : జాతర మహోత్సవానికి మంత్రిని ఆహ్వానించిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ

The Desk…Amaravati : జాతర మహోత్సవానికి మంత్రిని ఆహ్వానించిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ

🔴 అమరావతి : ది డెస్క్ :

వెంకటగిరి పట్టణంలో ఎంతో వైభవంగా జరగబోయే శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆహ్వానించేందుకు, వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ , స్థానిక నాయకులు గొల్లకుంట మురళి, AMC చైర్మన్ విశ్వనాధ్, ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి,దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పండితులు ఈరోజు తాడేపల్లిలోని మంత్రి నివాసానికి చేరుకున్నారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఆశీర్వచనం అనంతరం, పోలేరమ్మ అమ్మవారి శేషవస్త్రాన్ని మంత్రి ఆనం కు సమర్పించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో, శుభకార్యాల నడుమ, మర్యాదపూర్వకంగా జాతర ఆహ్వాన పత్రికను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పోలేరమ్మ అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకం అని, ఇది వెంకటగిరి ప్రజలకు గర్వకారణమని మంత్రి ఆనం తెలిపారు.

రాబోయే జాతర సందర్భంగా లక్షలాది భక్తులు పాల్గొననున్నందున, భక్తుల రాకపోకలు, వసతి, తాగునీరు, వైద్య శిబిరాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.ఆలయ అభివృద్ధి, జాతర నిర్వహణకు మరింత బలాన్ని చేకూర్చేందుకు దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల నుండి రూ.40 లక్షలు ఇప్పటికే విడుదల చేసినట్లు గుర్తు చేశారు.

వెంకటగిరి నియోజకవర్గంపై తనకున్న ప్రత్యేక అభిమానం వల్ల ఎల్లప్పుడూ ఆలయాభివృద్ధికి అండగా ఉంటానని, అమ్మవారి దర్శనం కొరకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సమన్వయంతో అన్ని శాఖలు కృషి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.పోలేరమ్మ జాతర ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, సాంస్కృతికంగా, చారిత్రకంగా కూడా విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు చిరస్మరణీయ అనుభూతి కలిగేలా ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు.

అంతకుముందు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాసేపు సమీక్షించారు. వెంకటగిరి ప్రజల ఆధ్యాత్మిక గర్వకారణమైన పోలేరమ్మ జాతర మహోత్సవం విజయవంతం కావడానికి మంత్రి ఆనం సహకారం విశేషమని స్థానిక ప్రజా ప్రతినిధులు అభినందించారు.