గుంటూరు జిల్లా : అమరావతి : ది డెస్క్ :
ప్రస్తుతం ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.
హరీశ్‌కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆయన.. ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ పొందారు. మెదక్, పెద్దపల్లిలలో ఏఎస్పీగా సేవలందించారు.
కృష్ణా, నల్గొండ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు రేంజి ఐజీగా, శాంతిభద్రతల విభాగం, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా, రైల్వే డీజీగా విధులు నిర్వహించారు.
2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. జనవరి 31న అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయడంతో.. ఇన్‌ఛార్జి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. తాజాగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించింది.