The Desk…Amaravati : 7ఏళ్ల బాలిక వేపాడ దివ్య హత్య కేసులో నిందితునికి మరణశిక్ష

The Desk…Amaravati : 7ఏళ్ల బాలిక వేపాడ దివ్య హత్య కేసులో నిందితునికి మరణశిక్ష

  • మహిళలపై నేరాలకు సంబంధించి గడచిన 8 నెలల్లో 97 నేరాలకు శిక్షలు

-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

🔴 అమరావతి : ది డెస్క్ :

పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడు సంవత్సరాల బాలిక వేపాడ దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితునికి మరణశిక్ష మరియు పది వేల రూపాయల జరిమానా విధించిన అనకాపల్లి జిల్లా, చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి.. (క్రైమ్ నెంబర్ 79/15).

వివరాల్లోకి వెళ్తే…

వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు బ్రతుకు తెరువు నిమ్మిత్తమై అనకాపల్లి జిల్లా, గొల్లపేట వీధి, దేవరపల్లి గ్రామంలో హోటల్ నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె వేపాడ దివ్య(7)స్థానిక ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకుంటుంది. తాము నిర్వహిస్తున్న హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా, చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి @ తంబిని (23) పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో ఆయన ప్రవర్తనతో విసిగి వేసారిన ధనలక్ష్మి, మురుగన్ దంపతులు సుబ్బాచారిని పనిలో నుండి తొలగించారు.

దీంతో అవమానంగా భావించిన సుబ్బాచారి కక్ష కట్టి వారి కుటుంబం మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూసాడు.2015 డిసెంబర్ 23వ తేదీన స్కూల్కు వెళ్లి వచ్చిన వేపాడ దివ్య సాయంత్రం నుండి కనపడకుండాపోయిందని తల్లిదండ్రులు వేపాడ ధనలక్ష్మి, భర్త మురుగన్ సహాయంతో దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఎవరిమీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా.. దివ్య మేనమామ అయిన సుబ్బాచారి చంద్రశేఖర్ ఫై వారు అనుమానం వ్యక్తం చేసారు. 2015 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 6 గంటలకు బిల్లాల మెట్ట వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక మృతదేహంపై కత్తితో కోయబడిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన బాలికను దివ్యగా గుర్తించి. సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకొన్నాడు.

23వ తారీఖున దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి, దివ్య చేతిలో 20 రూపాయలు పెట్టి గారెలు కొనుక్కోమని, అక్కడనుండి చిన్నారి దివ్యను రైవాడ జలాశయం సమీపంలోని బిల్లలమెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలకొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేసినట్లు నిందితుడు సుబ్బాచారి పోలీసుల వద్ద నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు సుబ్బాచారిపై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు నమోదు అయి ఉంది.

ఈ కేసును విచారణ జరిపిన చోడవరం, 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి కే. రత్నకుమార్ బాలిక హత్యకు కారణమైన నిందితునికి U/Sec 302 IPC ప్రకారం దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష మరియు రూ.10,000/- రూపాయల జరిమానా విధిస్తూ (01.04.2025)న తీర్పు వెలువరించారు.కేసును చేధించి, న్యాయస్థానం ముందు పటిష్టమైన సాక్షాధారాలు ఉంచి నిందితునికి ఉరి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు.

ఈ సందర్భంగా మహిళలపై నేరాలకు సంబంధించి గడచిన 8 నెలల్లో 97 నేరాలకు శిక్షలు పడ్డాయని అందులో 04 నేరాలకు 25 సంవత్సరాల జైలు శిక్ష, 22 నేరాలకు జీవిత ఖైదు, 17 నేరాలకు 20 సంవత్సరాల జైలు శిక్ష 4 నేరాలకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 50 నేరాలకు 07 సంవత్సరాల జైలుశిక్షలు పడ్డాయని డీజీపీ వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై హత్య, అత్యాచారాలకు పాల్పడేవారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీజీపీ హెచ్చరించారు.