అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున..
అమరావతి : ది డెస్క్ :
వివరాల్లోకి వెళితే..
గతంలో తనను హౌజ్ అరెస్ట్ చేసిన మహిళా కానిస్టేబుల్ ఇంటికి హోం మంత్రి!
తీవ్ర భావోద్వేగానికి గురై…ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తన శాఖలో విధులు నిర్వహిస్తున్న గర్భిణీ మహిళా కానిస్టేబుల్ రేవతి ఇంటికి వెళ్లి సీమంతం చేశారు.
గతంలో హౌస్ అరెస్ట్ సమయంలో రేవతి డ్యూటీలో ఉండటాన్ని గుర్తుచేసుకున్న అనిత, ఇప్పుడు తాను ఆమెకు సీమంతం చేయడం అదృష్టంగా భావించానని తెలిపారు. ఈ పనితో హోం మంత్రి అనిత గొప్ప మనసును చాటుకున్నారు. టీచర్‌గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న వంగలపూడి అనిత, ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.
ఇప్పుడు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. బిజీ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో ఉంటారు. అంతేకాదు తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు సైతం ఎవరైనా ఆపదకు గురైతే వెంటనే కాన్వాయ్ ను ఆపి పరామర్శించి వెళ్తారు. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు హోం మంత్రి అనిత గొప్ప మనసును చాటుకున్నారు. తన శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారు.
అంతేకాదు ఎంవీపీ పీఎస్ లో పనిచేస్తూ గర్భిణిగా ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్ రేవతికి కు సీమంతం చేశారు. హోం మంత్రి ఏకంగా తన ఇంటికి వచ్చి ఆశీర్వదించినందుకు మహిళా కానిస్టేబుల్ రేవతి భావోద్వేగానికి గురయ్యారు. తన ఇంటికి వచ్చి తన కుటుంబ పరిస్థితి, యోగక్షేమలు తెలుసుకోవడంతో పాటు గర్భిణిగా ఉన్న తనకు సీమంతం చేసి ఆశీర్వదించడంతో ఆ మహిళా కానిస్టేబుల్ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళా కానిస్టేబుల్ రేవతిని హోం మంత్రి అనిత హత్తుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ఒక కీలక విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
గతంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితను ఒక సందర్భంలో హౌస్ అరెస్ట్ చేయాలని అధికారుల నుంచి ఎంవీపీ పోలీసులకు ఆదేశాలు అందాయి. దీంతో అప్పట్లో మహిళా కానిస్టేబుల్ గా ఉన్న రేవతి.. అనిత ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ హౌస్ అరెస్ట్ డ్యూటీలో ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన హోం మంత్రి ‘ పరిస్థితులు ఎలా ఉంటాయంటే.. ఆ రోజు ఈమె హౌస్ అరెస్ట్ కోసం వచ్చింది.. ఇప్పుడు నేను ఆమెను సీమంతం చేశాను..’ అని అన్నారు.
దీంతో మహిళా కానిస్టేబుల్ రేవతి తో పాటు అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వకుండా ఉండలేకపోయారు. దానికి ‘ ఇలా మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడం నా అదృష్టంగా భావిస్తున్న’ అని హోం మంత్రి చెప్పిన మాటలకు నవ్వుతూ బదులిచ్చారు మహిళా కానిస్టేబుల్ రేవతి.