🔴 అమరావతి : ది డెస్క్ :
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అనేది ఉపనిషత్ వాక్యం. మహిళలు గౌరవం పొందేచోటే దేవతలు వసిస్తారన్నది తాత్పర్యం. మహిళను దుర్గగా కొలుస్తాం. శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తాం. గుడికట్టి పూజించడానికీ సిద్ధమే కానీ, గడప దాటి బయటకు రావద్దంటాం. లక్ష్మణరేఖలు గీస్తుంటాం. దేహమైనా, దేశమైనా సగభాగాన్ని కాదని మనుగడ సాగించగలవా? అది అసంభవమని తెలుసుకొనలేకపోతున్నాం.
దిద్దుబాటుకు సిద్ధపడలేకపోతున్నాం. ఇలా ఎన్నాళ్ళు?మన సమాజంలో ఏడు దశాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే అనాదిగా ఆడపిల్లల పట్ల చూపిన వివక్ష ఫలితంగా మగపిల్లవాడి పెళ్ళి నేడు కన్న తల్లిదండ్రులకు పెను సవాల్గా మారింది. 20 – 45 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న పురుషులు దేశంలో సుమారు 6 కోట్ల మంది నేడు బలవంతపు బ్రహ్మచర్యం పాటించాల్సివస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చునని మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తున్న వారి విశ్లేషణ.
శాస్త్ర సాంకేతిక రంగం పెరిగి చంద్రుని మీద ఆవాసాలు ఏర్పాటుచేసుకొనే దిశగా ఆలోచన చేస్తున్న ఈరోజుల్లో ఆడపిల్ల పట్ల వివక్ష విపరీతంగా పెరగడం శాస్త్ర సాంకేతికతతో ముందుకు నడుస్తువన్నామనుకుంటూనే, ఆలోచనలపరంగా మనం వెనక్కి నడుస్తున్నట్టే లెక్క. మహిళా సాధికారత గురించి పాలకులు ఉపన్యాసాలు ఇచ్చే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా క్షేత్ర స్థాయి వాస్తవాలు గగుర్పాటు కలిగిస్తున్నాయనడంలో అతిశయోక్తిలేదు. ఇదే దోరణి కొనసాగితే పురుషాధిక్య సమాజంలో మహిళా సాధికారత సమీప భవిష్యత్తులోనే కాదు, ఎన్నటికైనా సాధ్యమా? అని సందేహం కూడా కలుగుతోంది. మహిళల పట్ల పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రానంతవరకు మహిళా స్వేచ్ఛ, మహిళా స్వాతంత్య్రం, మహిళా సాధికారిత ఉపన్యాసాలకు పనికొచ్చే ఊతపదాలుగా, సర్కారు కంటితుడుపు పధకల్లో అందంగా ఒదిగే పారిభాషక పదాలుగానే మిగిలిపోతాయి.
జాతీయ నేర నమోదు సంస్థ 2021 నివేధిక ప్రకారం మహిళలపై జరగుతున్న అక్రమాలపై 428278 కేసులు అధికారికంగా నమోదు అయ్యాయి. ఇది 2020లో నమోదు అయ్యిన కేసులు కన్నా 87% పెరిగిందని ప్రభుత్వం దగ్గిర ఉన్న గణాంకాలు. ఇక అనధికారిక లెక్కలు ఎన్నో మనం ఊహించుకోవచ్చు. నగరాల్లో మహిళలపై జరుగుతన్న హింస నానాటికి పెరగడం ఆందోళన కరంగా ఉందని అనుకోవచ్చు. ఒకసారి 2014 – 2019 మధ్య గత గణంకాలు పరిశీలిస్తే మహిళలపై జరుతుగుతున్న హింసలో వార్షికంగా కేంద్ర పాలితప్రాంతమైన ఢిల్లీలో 11,449 కేసులతో దేశంలోనే ప్రధమస్థానంలో ఉంటే, ముంబాయి, బెంగళూరులో 2946, 2608 కేసులు నమోదు కాబడ్డాయి.
ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళా హింస నేరాలలో 1775 కేసులు నమోదు కాబడి దేశంలో అగ్రరాష్ట్రాల సరసన నిలిచింది. అదే విధంగా ఢిల్లీలో 125, పట్నా 61, బెంగళూరు 51, వరకట్న మరణాలు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్లో 42 మరణాలు నమోదు కాబడ్డాయి. స్త్రీల పై ఆగాయిత్యాలలో 3069, కలకత్తా 707, బెంగళూరు 378, ఆంధ్రప్రదేశ్లో కూడా స్త్రీల పై ఆగాయిత్యాలు ఆందోళన కలింగిచే స్థాయిలో ఉన్నాయిని నివేదికలు బట్టబయిలుచేసాయి. ఇక వేల సంఖ్యలో మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదృశ్యం అయ్యారని 2024 ఎన్నికల ప్రచారంలో రాజకీయ పక్షాలు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించరో అందరికి తెలిసిందే.
ఇదే కాకుండా స్త్రీ, పురుష నిస్పత్తిలో ఆందోళన కలిగించే ఆంతర్యం నానాటికి పెరుగుతుందని మేధావులు కూడా ఆందోళన చెందుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్లే అని తెలిసి బృణహత్యలకు పాల్పడడం. ఆ దశదాటి పుట్టినా సజీవంగానే కుప్పతొట్టెలో విసిరేయడం, పుట్టిననాటినుంచి అడపిల్లని అంగడి సరుకులా అమ్మివేయడం, సంప్రదాయపు కట్టుబాట్లతో ఆడపిల్ల ఎదుగుదలను అడుగడుగునా కట్టడి చేయడం, యుక్తవయసులో ప్రేమా పేరుతో వేధించి, మాట చెల్లుబాటు కాలేదని రాక్షసంగా చిదిమేయడం, పెళ్ళయ్యాక వరకట్నం వేధింపులతో, ఆదిపత్యం సతాయింపులతో అంతమొందించడం… ఇవన్నీ నేటి మహిళ దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల మహిళల్లో ఈ వివక్ష పెరగడం ఆందోళన కలిగించే ఆంశమే. ఎంత ఆధునికతవైపు నడుస్తున్నా మహిళలపట్ల ఆలోచనలు మెరుగుపడకపోగా, మరింత దిగజారుడుతనమే కనిపిస్తోంది. ఏయేటి కాయేడు మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ఎవరికీ పట్టడంలేదు. చట్టబద్ధమైన సంస్కరణలు, చిత్తశుద్ధితో కూడిన ఆచరణ ఉంటే తప్ప ఆడపిల్లలకు రక్షణ లేదేమో అనిపిస్తోంది.*ఈ లెక్కలు దేనికి సంకేతం!*దేశంలో లింగ నివృత్తి ప్రమాదకరంగా మారుతోంది. సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 మంది మాత్రమే మహిళలున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులు ఆడపిల్ల పట్ల వివక్షతో అనుసరించిన పద్ధతుల ఫలితంగా… యువకులకు తమ ఈడు ఆడపిల్లలు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకప్పటి పరిస్థితి తారుమారై… మగపిల్లవాడి పెళ్ళి తల్లిదండ్రులకు పెను సవాల్గా మారింది. అయినా ఆడపిల్ల పుట్టుకను ఈసడించుకుంటున్న స్థితిలో.. ఇరవై, ముఫ్ఫై ఏళ్ళ తర్వాత పరిస్థితులు ఇంకెంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. నేడు 20 – 30 ఏళ్ళ యువకులకు వివాహం అయ్యి భార్య ఉందంటే అదృష్టవంతుల కింద లెక్కే. ఆ వయసు యువకులు దేశంలో సుమారు 6.63 కోట్ల మంది ఉంటే, అదే వయసు యువతులు సుమారు 2.95 కోట్లు మాత్రమే ఉన్నారు. మన జనాభా లెక్కల్లో లింగ వ్యత్యాసాన్ని విశ్లేషించినపుడు ఈ గణాంకాలు బయపడ్డాయి. మొత్తమ్మీద వివాహం కాని పురుషులు (20-45) సుమారు 6.50 కోట్ల మంది ఉంటే, అదే వయో పరిమితిలోని అవివాహిత స్త్రీలు సుమారు 2.38 కోట్లు ఉన్నారు. సుమారు 5.50 కోట్ల మంది పురుషులు బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నట్లు మ్యారేజ్ బ్యూరోని వాకబు చెస్తే పరిస్థితి తేటతెల్లమౌతుంది.
*ఎవరుచేసిన పాపం ఎవరిని వెంటాడుతోంది!*పుట్టబోయే బిడ్డ ఆడ, మగనా అని తేల్చే లింగ నిర్ధారణ పరీక్షలు మన దేశంలో 1970 దశకంలో మొదలై, 1980 దశకంలో పెచ్చుపెరిగాయి. ఆర్ధిక సరళీకరణ విధానాలు, గ్లోబలీకరణ మనిషి ఆలోచనా ధోరణిని మార్చిన క్రమంలోనే ఆడపిల్ల పట్ల వివక్ష విపరీతంగా పెరిగింది. ఈ ఏడు దశాబ్దాల్లోనూ ఆడపిల్లల్ని నిర్మూలించే దుశ్చర్యలు విచ్చలవిడిగా జరిగాయి. తల్లి కడుపున ఉండగానేనో, పుట్టీపుట్టగానేనో ఆడపిల్లల ప్రాణాలను చిదిమేసిన దుష్ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం, వాటి ఫలితాలను తల్లిదండ్రులకు తెలియపరచడం నేరమని చెప్పే చట్టాలున్నా గోప్యంగా అవి జరుగుతూనే ఉన్నాయి. ‘‘ఈ సాంకేతిక వైద్య సదుపాయం రాను రాను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించిందని, కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఇది భవిషత్తులో దుర్మార్గమైన స్థితికి చేరుతుంది”. అని `గర్భస్థ శిశు సాంకేతిక పరీక్షల (పిసీపీఎస్డీటీ) చట్టం’ పర్యవేక్షణ కమీటీ గత సభ్యురాలైన డాక్టర్ నీలమ్ సింగ్ అనడం గమనార్హం.
శాస్త్ర సాంకేతికతతో ముందుకు నడుస్తున్నామను కుంటూనే మనం పెడదారి పట్టిన ఆలోచనలతో కచ్చితంగా వెనక్కి నడుస్తున్నట్లే లెక్క.‘‘1990, 2020లలో పుట్టిన వారు మా దగ్గరికి వస్తుంటారు. కానీ వారికి అనువైన మ్యాచెస్ దొరకవు. కులం, చదువు, ఆస్తి, వయసు ఇలా పలు విషయాల్లో రాజీపడతామంటారు. అయినా వధువులు దొరకరు’’ అని మ్యారేజీ బ్యూరో నిర్వహించే మధ్యవర్తులు అంటున్నారు. 1901లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 972 మహిళలు ఉండేవారు. సహజ నిష్పత్తి 1000, 954 కన్నా ఇది మెరుగైన స్థితి, ప్రతి వెయ్యి మంది పురుషులకు 1970లలో 930 మహిళలున్నారు. 1980లలో అది 934కాగా 1990లలో ఆ సంఖ్య 927కు పడిపోయింది. 2000లలో అది 933గా నమోదయింది. 2023లో 938. అంతే నేటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు.
*ఆలోచనా ధోరణిలోనే లోపం*మహిళల పట్ల మన ఆలోచనా ధోరణిలోనే లోపముంది. పురుషాధిక్య వ్యవస్థలో వారిని నిమ్న లింగంగా పరిగణించే తత్వం బలంగా వేళ్లూనుకొని ఉంది. తల్లిదండ్రుల నీడలో ఆడుకునే పిల్లల నుంచి నేడో రేపో ప్రాణాలు విడిచే ముసలి వాళ్ళ వరకు అదే ఆధిపత్య ధోరణి, అదే వివక్ష కొనసాగిస్తుంటారు. అన్ని సందర్భాలలోనూ వారిని తక్కువ చేసి చూడడం రివాజుగా మారింది. స్త్రీ పురుషులు చేసే ఒకే పనికి ఇచ్చే కూలి డబ్బులు, వేతనాల నుంచి అన్ని స్థాయిల్లోనూ ఈ వ్యత్యాసాలుంటాయి. పని ప్రదేశాల్లోని వివక్ష, అవమానాలు మహిళల్ని ప్రాణాంతక స్థితికి నెడుతున్నాయి. వారసత్వ ఆస్థిలో పురుషులతో సామానంగా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించే చట్టం ఉన్నా, ఆచరణలో ఎక్కడా అది ఆచరణలో కనిపించడంలేదు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వారి అర్హతలకు తగ్గ అవకాశాలను కల్పించకపోగా సహజ సిద్ధంగా సంక్రమించిన హక్కుల్ని కూడా కాలరాస్తున్నారు.
ప్రపంచ ఆర్ధిక నివేధిక 2023 ప్రకారం మహిళా సమానత్వ సాధనలో ఐస్ ల్యాండ్ దేశం ప్రపంచ దేశాల్లో తొలిస్థానంలో నిలిస్తే భారత స్థానం ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్య, ఆరోగ్యంలో 143 స్థానంలో నిలిచి మహిళా సమానత్వంలో అధమ స్థానంలో ఉన్నామంటే మహిళా సమానత్వంలో మన దేశం ఏస్థాయిలో ఉందో ఆలోచించాలి. నేటికీ కూడా మనదేశంలో పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు.. అత్యున్నత చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామనే మహిళా బిల్లు ప్రతిపాదన గడచిన దశాబ్ద కాలంగా పార్లమెంటులోనే నగుబాటుకు గురవుతోంది. సాక్ష్యాత్తు గత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చట్టసభల్లో మహిళా ప్రాతినిత్యం కేవలం 12% ఉందని ఈ సంఖ్యను పెంచడానికి అందరూ సహకరించాలని కోరడం మహిళల పట్ల రాజకీయ వివక్ష ఏవిధంగా అర్ధం పడుతుంది.
ఆఫ్రికా ఖండానికి చెందిన రువాండా దేశ పార్లమెంట్లో పురుషుల కన్నా స్త్రీల పార్లంమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువ. రువాండా దేశ నిబంధనల ప్రకారం పార్లమెంట్లో స్త్రీలకు కోటా 30శాతమే అయినా 64శాతం పార్లమెంట్ సభ్యులు మహిళలే కావడం గమనార్హం. రువాండాలో ‘‘జెండర్, ఫ్యామిలీ ప్రమోషన్ పేరిట’’ మంత్రిత్వశాఖ ఉంది. స్త్రీలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ను రూపొందించే సాంప్రదాయం రువాండా దేశంలో ఉండి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆఖరికి న్యాయ వ్యవస్థలోనూ మహిళలకు అన్యాయమే జరుగుతుంది.
మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా మహిళా న్యాయ మూర్తుల సంఖ్యను కోర్టుల్లో పెంచుకోలేకపోయాం. 1989 అక్టోబర్ 6 న ఫాతిమా బీవీ సుప్రీమ్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులు లేరు. ఫాతిమా బీవీ తర్వాత రెండేళ్లకు సుజాత మనోహర్ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇలా ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర పరిపాలనలో 276 మంది సుప్రీం కోర్టు జడ్జిలను నియమించుకున్నా కేవలం 11 మంది మహిళలను మాత్రమే సుప్రీమ్ కోర్టు జడ్జిలు కాగలిగారు. ప్రస్తుతం 34 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో మహిళలు ఇద్దరే ఉన్నారు. హైకోర్టులలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి.
జ్యూడిషరీలో మాత్రమే కాదు, చట్టసభలలో, పాలనా యంత్రంగంలో కూడా మహిళలకు దక్కవలిసిన సముచిత స్థానం దక్కడం లేదనే వాస్తవాలు అందరు నమ్మవల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నా, మెజారిటీ స్థానాల్లో మహిళల్ని నామ మాత్రం చేసి వారి భర్తలు, తండ్రులు, సోదరులు, ఇతర పెత్తందారులు అధికారం చెలాయించడం స్థానిక సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మార్పురావల్సిన అవసరం ఉంది. ఆడ, మగ అనే తేడా సృష్టిపరమైన సహజ వైవిధ్యమే తప్ప ఇరువురూ సరిసమానమనే భావనల్ని పిల్లల్ని పెంచేటప్పుడే తల్లిదండ్రులు వారిలో నాటాలి. స్త్రీలను గౌరవించే మన సంస్కృతీ సంప్రదాయాల్ని వివరించాలి. ప్రభుత్వపరంగా కూడా నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించి సంస్కరణల్ని కఠినంగా అమలుపరచాలి. ఇప్పటికే ఉన్న చట్టాల్నైనా పకడ్బందీగా అమలు చెయ్యాలి.
చట్టాల కన్నా సాంఘిక చైతన్యంతోనే మనం ఒకప్పుడు సతీసహగమనాన్ని రూపు మాపగలిగాం. ఆడపిల్లని కాపాడ్డానికి అలాంటి సామాజిక పరివర్తన రావాలి. అర్జెంటీనా, లాటిన్ అమెరికా దేశాల్లో మహిళలకి చట్ట సభలో మూడోవంతు స్థానాలను రిజర్వు చేసిన తర్వాత గణనీయమైన మార్పులొచ్చాయి. మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలు సాదిస్తారనడంలో సందేహంలేదు. భారత్ లో 29 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటి వరకు అధికారిన్ని చేపట్టి 17 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా రాణించి చరిత్ర సృష్ఠించారు.
ఇక మన రాష్ట్రనికి వస్తే ప్రభుత్వం 2027కి దేశంలో మూడవ ఆగ్రగామి రాష్ట్రంగా, 2047 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచ స్థాయి మౌళిక వసతులకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో 15 శాతం వృద్ధి రేటుతో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రణాళిలకలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం *‘‘బేటి పడావో బేటిబచ్ఛావో“* అనే నినాధంతో మహిళా సాధికారత కోసం విధానాలు తయారుచేస్తు మహిళా అభివృద్ధికి సంస్కరణలు తీసుకొస్తున్నారు. అయితే సంస్కరణలు అమలులో విధాన పరమైన లోపాలను క్షేత్రస్థాయిలో అధికమించి మహిళా సాధికారితకు తయారుచేసిన ప్రణాళికలను అమలు చేస్తేనే పురుషులతోపాటు స్త్రీలకు సమాన అవకాశాలు కలుగుతాయి. ఆజాదికా అమృత్ మహోత్సవాలు దేశంలో జరుపుకున్నాం.
వికసిత భారత్ నినాదంతో దేశం ముందుకు వెళ్తుంది. ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2047 సంవత్సరానికి ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అలాగే ‘నారీ శక్తితో వికసిత భారత్ అనే నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శినికతలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి సంస్కరణలు తెచ్చి నారీ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలుపుతారని ఆశిద్దాం. ఒకవేళ అదే నిజమైతే భారదేశంలో ‘‘స్త్రీ, పురుష తులాభార(త)o’’ అన్నిరంగాల్లో సమానంగా ఉంటుంది.
వ్యాసకర్త : తూతిక శ్రీనివాస విశ్వనాథ్, మాజీ సైనికుడు, పూర్వపు డీపీఓ, పూర్వపు ఈడీ ఎస్సీ కార్పొరేషన్, సెల్ : 7675924666