🔴 అమరావతి : ది డెస్క్ (ప్రత్యేకం) :

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె సేవాభావానికి ప్రశంసలు కురిపించారు. అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి నియమితులైంది.
ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి అమరావతి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్న వైష్ణవిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
అమరావతికి ఆంబుల వైష్ణవి రూ.50 లక్షలు విరాళం
అత్యంత చిన్న వయస్సులోనే అమరావతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వైష్ణవి, రాజధానికి నిధుల సమీకరణలోనూ కీలక పాత్ర పోషించారు. గతంలోనే రూ. 50 లక్షలు విరాళంగా అందించిన ఆమె, అమరావతి నిర్మాణం కోసం మరింత విరాళాలు సమీకరించాలనే సంకల్పాన్ని సీఎం ముందు వ్యక్తం చేశారు.

వైష్ణవి యువతకు ఆదర్శం – సీఎం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “రాష్ట్రాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలి. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతీ యువకులలో సేవా స్పూర్తి పెంపొందేలా ప్రోత్సహించాలి. అంబుల వైష్ణవి లాంటి యువతీ యువకులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలి” అని సూచించారు.
అమరావతి అభివృద్ధికి విస్తృత ప్రచారం చేస్తానంటున్న వైష్ణవి
అమరావతి రాజధాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైష్ణవి తనవంతు కృషి చేయాలని సీఎం సూచించారు. రాజధాని నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలను విస్తృతంగా ప్రచారం చేసి, అందరి మద్దతు పొందేలా పనిచేయాలని అన్నారు.
సీఎం అభినందనలు – వైష్ణవి స్పందన
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె సేవాభావానికి ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ… “అమరావతి అభివృద్ధి నా కల. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేకరించేందుకు నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు.
అమరావతి భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంబుల వైష్ణవి, ఆమె సామాజిక సేవాభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
నిస్వార్థ సేవకు నిలువుటద్దం – వైష్ణవి & డాక్టర్ మనోజ్
సేవను గుర్తించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవల కొద్ది రోజుల క్రితం అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ ల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నియామకాలలో భాగంగా మొట్టమొదటిగా అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి (మెడికో)ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం.

మొట్టమొదటిగా – అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా…వైష్ణవి (మెడికో) “ది డెస్క్” ప్రతినిధితో మాట్లాడుతూ…!!
నాపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో తొలిసారిగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల నియామక అవసరాన్ని గుర్తించి మొట్టమొదటిగా తనను గౌరవించి ఇచ్చిన ఈ బాధ్యతను శిరసా వహించి, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు ఆశలకు అనుగుణంగా అంబుల వైష్ణవి అనే నేను.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు మరియు అమరావతి నిర్మాణానికి దృఢ సంకల్పంతో తన వంతు కృషి చేసి నిస్వార్ధంగా పనిచేస్తానని , అమరావతి నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు నిధుల సేకరణే లక్ష్యంగా పనిచేస్తానని.. ఇంకా నావలే ఎంతోమంది అంబాసిడర్లు రావాలని అంబుల వైష్ణవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నన్ను గుర్తించి అప్పగించిన ఈ బాధ్యతను తన తండ్రి డాక్టర్ మనోజ్ సహకారంతో ముందుకు వెళతానని అంబుల వైష్ణవి (అమరావతి బ్రాండ్ అంబాసిడర్) “ది డెస్క్ ప్రతినిధి” కి తెలిపారు.
ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మరియు తండ్రి డాక్టర్ మనోజ్ విజనరీ విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.