The Desk…Amaravati : కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

The Desk…Amaravati : కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • ఏలూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ.

అమరావతి/ ఏలూరు : THE DESK NEWS :

కొల్లేరు ప్రాంతంలో దీర్ఘకాలికంగా నివసిస్తున్న ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఏలూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్రంగా చర్చించారు.

జిరాయితీ భూములు 15 వేల ఎకరాలు, సొసైటీ భూములు 7 వేల ఎకరాలు విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సర్వే చేసి హద్దులు నిర్ణయించడంలో వహించిన నిర్లక్ష్యం కారణంగా కొల్లేరు ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కొల్లేరు ప్రాంత ప్రజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ, సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు.

సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ఎంపీ మహేష్ కుమార్, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కొల్లేరు ప్రాంతంలో పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, అక్కడి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు న్యాయం చేయడానికి ప్రభుత్వ పరంగా పూర్తి అండగా ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లేరు ప్రాంతంలో అధికారులు చేపట్టిన ధ్వంసం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసే దిశగా న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరలో పర్యావరణ, అటవీశాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కొల్లేరు ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అక్కడి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు భరోసా ఇచ్చారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందనే విషయాన్ని వారికి తెలియజేయాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించారు.

కొల్లేరు సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.