The Desk…Amaravati : CM భద్రతా వలయంలో కౌంటర్‌ యాక్షన్‌ టీమ్స్

The Desk…Amaravati : CM భద్రతా వలయంలో కౌంటర్‌ యాక్షన్‌ టీమ్స్

🔴 అమరావతి : THE DESK NEWS :

ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు వచ్చి చేరాయి.

సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ)లో ఇటీవల పలు మార్పులు చేశారు.

బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు, ఎస్‌ఎస్‌జీ సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్‌ యాక్షన్‌ బృందాలూ ఇప్పుడు రక్షణలో ఉంటాయి.

భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీపడకుండా కౌంటర్‌ యాక్షన్‌ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉంటారు.

బయటి నుంచి జరిగే దాడి ఎదుర్కొనేలా చంద్రబాబుకు మూడంచెల భద్రతలో తొలి వలయంలో ఎన్‌ఎస్‌జీ, రెండో వలయంలో ఎస్‌ఎస్‌జీ, వివిధ చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంగా ఉంటాయి.

వీరందరితో పాటు సీఎంకు కొద్ది దూరంలో నిత్యం వెన్నంటి ఆరుగురు కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు ఉంటారు. ఆపద సమయాల్లో మొదటి, రెండో వలయంలోని సిబ్బంది ముఖ్యమంత్రిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే, కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌.. బయటి నుంచి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారిస్తుంది.

ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) శిక్షణలో కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు రాటుదేేలారు. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌నూ అమలు చేస్తున్నారు.

నలుపు రంగు చొక్కా, ముదురు గోధుమ రంగు ప్యాంటును కమాండోలు ధరిస్తారు. వీరి చొక్కాకు ముందు, వెనుక ఎస్‌ఎస్‌జీ అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి.