ఏలూరు జిల్లా : కైకలూరు/కలిదిండి : THE DESK :
మండల శివారు ప్రాంతమైన ఆలపాడు – చిన తాడినాడ సరిహద్దులో రహదారి పక్కన ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని చినతాడినాడ ప్రజాప్రతినిధులతో కలసి గ్రామస్థులు అడ్డుకున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వీలులేదని రహదారిపై నిరసనకు దిగారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని అబ్కారీ శాఖాధికారులకు, పోలీసులకు తెగేసి చెప్పారు గ్రామస్తులు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రధాన రహదారి అయినటువంటి ఉప్పుటేరు నుండి తాడినాడ వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు పక్కన మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే స్కూల్ విద్యార్థులు, మహిళలు ఇబ్బందులకు గురవుతారన్నారు. గ్రామానికి సరైన బస్సు సౌకర్యం కూడా లేదని, పొట్టకూటికోసం పనులకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి తిరిగొచ్చే మహిళలు భయబ్రాంతులకు గురవుతారన్నారు.

అసలే ఇటీవలకాలంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయి స్త్రీలు ఇంటి నుండి బయటకు రావడానికే భయపడుతున్నారని.. జరగకూడని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నాయకులు, గ్రామస్తులు ప్రశ్నించారు.
అలాగే రాత్రి వేళలో మద్యం దుకాణం కు ఎదురుగా వాహనాలు నిలపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. అందుచేత ఈ ప్రాంతంలో మద్యం దుకాణం పెట్టడం సరికాదని హితవుపలికారు. అబ్కారీ శాఖాధికారులు, పోలీసుల స్పష్టమైన హామీతో నిరసన విరమించారు.

నిరసనలో చినతాడినాడ ప్రెసిడెంట్ గండికోట ఏసుబాబు , జంపన వెంకట పెద్దిరామరాజు (చిన రాము), జంపన సురేష్ రాజు, జంపన సుబ్బరాజు, వైస్ ప్రెసిడెంట్ యాళ్ళ స్టీవెన్సన్, పత్తే ఆనంద రాజు, మోరా మణి, శీలం ప్రసాద్, సోర్ర అరవింద్, కొల్లాటి శ్రీను, కొల్లాటి పెద్దిరాజు, రామకృష్ణ, బొర్రా శ్రీను, పెరుమాళ్ళ సుబ్బారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.