The Desk…Aachanta : ఆచంటలో డయాలసిస్ కేంద్రాలకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భూమి పూజ

The Desk…Aachanta : ఆచంటలో డయాలసిస్ కేంద్రాలకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భూమి పూజ

ప.గో జిల్లా : భీమవరం/ఆచంట : ది డెస్క్ :

నరసాపురం పార్లమెంట్ పరిధిలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆచంటలో డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

రోజురోజుకీ డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు రూ.10 కోట్ల CSR నిధులు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

భీమవరం ఏరియా హాస్పిటల్ వద్ద రూ.2 కోట్ల వ్యయంతో 8 అత్యాధునిక యంత్రాలు, 8 బెడ్లు కలిగిన డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి, అలాగే ఆచంట CHC వద్ద రూ.1 కోటి వ్యయంతో 3 యంత్రాలు, 3 బెడ్స్ కలిగిన డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కేంద్రాలు ప్రారంభమైతే స్థానిక రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అవుతుందని ఆయన తెలిపారు.

ప్రజా ఆరోగ్య సంరక్షణలో మరో కీలక కార్యక్రమంగా రూ.4 కోట్ల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ మొబైల్ వ్యాన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు అక్కడికక్కడే అందజేస్తుందని వివరించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు.

వశిష్ట గోదావరిపై కోడేరు–గణవరం బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం వచ్చిన వెంటనే శుభవార్త అందిస్తామని మంత్రి చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని ఒక రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలన్న ప్రతిపాదన కూడా కేంద్రానికి పంపినట్లు తెలిపారు.ఆచంట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కమిటీ హాల్స్ నిర్మాణం చేపడతామని శ్రీనివాస వర్మ ప్రకటించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.