The Desk…Kaikaluru : కొల్లేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యటన

The Desk…Kaikaluru : కొల్లేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యటన

ఏలూరు జిల్లా: ఏలూరు/కైకలూరు : THE DESK :

కొల్లేరు ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కొల్లేరు వరద తగ్గేవరకు ఎవరూ బయటకు రావొద్దు…

వరద ప్రభావ గ్రామాల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు…

నిత్యావసర సరుకులు బోటు ద్వారా గ్రామాల ప్రజలకు సరఫరా చేయాలి…

— జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, కృష్ణానది, బుడమేరు నుంచి వస్తున్న జలప్రవాహాలతో కొల్లేరు సరస్సుకు వరదముంపు పొంచివున్నందున ముంపుకు గురైయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, లు మండవల్లి మండల శివారు పెద్దడ్లగాడి వద్ద వరద పరిస్ధితిని పరిశీలించారు. అక్కడ ప్రజల సమస్యలను గ్రామ సర్పంచ్ , కొల్లేరు సరస్సు అధ్యక్షులు, గ్రామ పెద్దలు, ప్రజలతో కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది వరద నీరు పెరుగుతున్న దృష్ట్యా కొల్లేరు వరద ప్రాంతాల ప్రజలు ఎట్టి పరిస్ధితుల్లోను రెండు రోజులపాటు గ్రామాల్లోనే వారి నివాసాల్లోనే ఉండాలని బోట్లు ద్వారా ప్రయాణం నిషేధించామని తెలిపారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ల పర్యవేక్షణలో క్యాంపులు నిర్వహిస్తారని, గర్భిణీ స్త్రీలను ముందుగానే పిహెచ్ సిలకు తరలించామని, జ్వరం, పాముకాటు, విరోచనాలు, చంటిపిల్లల మందులు, తదితర ఔషదాలను మెడికల్ క్యాంపులో అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్ధితుల్లో నిత్యావసర వస్తువుల సరఫరా చేయడానికి బోటును ప్రభుత్వం అనుమతిస్తుందని ఆ బోటు ద్వారా సరుకులు గ్రామాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో విఆర్ఓలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా గ్రామాల ప్రజలు బోట్లుమీద ప్రయాణించకుండా పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోను గ్రామాల్లోని పిల్లలు సరదాలకోసం చేపల వేటకు, ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటి వద్దనే ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండవల్లి మండలం పెద్దఎడ్లగాడి, మలుగునూరు వంతెన వద్ద కొల్లేరు వరద నీటికి అడ్డుగా వున్న గుర్రపుడెక్కను ఇరిగేషన్ శాఖ వారు ప్రొక్లేన్ ద్వారా తొలగించే పనులను కలెక్టర్ పరిశీలించారు. బడుమేరు నుంచి వచ్చే వరదనీరు పెరుమలంక నందిగాయిలంక, శ్రీరామ్ నగర్, ఇంగిలిపాక, గ్రామాలకు వెళ్లే రహదారులు జలదిగ్బంధంలో ఉండటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయని గ్రామ ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మండల తహశీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. బుడమేరు వరదనీరు నాలుగు మీటర్ల ఎత్తువరకు వస్తే ప్రమాదకరంగా మారుతుందని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వరదనీరు పెరుగుతున్న సమాచారాన్ని గ్రామ పెద్దలు ఎప్పటికప్పుడు రెవిన్యూ అధికారులకు, సిబ్బందికి తెలియజేస్తే తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోను గ్రామ ప్రజలు వారి వారి నివాస గృహాల వద్దనే ఉండాలని రెండు రోజుల్లో వరద ఉధృతి తగ్గుతుందని కలెక్టర్ చెప్పారు. ఇరిగేషన్ , రెవిన్యూ, ఫారెస్టు, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వరద వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, ఇన్ చార్జి తహశీల్దార్ శ్రీనివాసరావు, యంపిడివో బండి ప్రణవీ, ఇరిగేషన్ , పోలీస్ , ఫారెస్టు అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.