ఏలూరు జిల్లా : ద్వారకా తిరుమల: The Desk : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని, వర్షాలు తగ్గేంతవరకు సిబ్బందికి సెలవులు మంజూరు చేయబడవని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పేర్కొన్నారు. శనివారం ద్వారకా తిరుమల పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన డీపీఓ వర్షాల కారణంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అన్న విషయంపై అరా తీశారు. విస్తరణ అధికారి ఏ.వి సుబ్బరాయన్ తో కలిసి డ్రైనేజీలు, త్రాగునీరు బోర్లు, పారిశుధ్యం నిర్వహణ పరిశీలించారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు మేరకు స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, లోతెట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూమ్ కి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు కూడా కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, వయోవృద్దులు, పిల్లలు తోడులేకుండా బైటకు రావద్దని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో జిల్లా యంత్రంగం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. అనంతరం త్రాగునీరు పరీక్ష కిట్టు ద్వారా నీటి పరీక్షలు ఎలా చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
