The Desk…West Bengal : బెంగాల్‌ హత్యాచార ఘటన…. ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన గుంపు…. సాక్ష్యాలు చెరిపేందుకేనా..❓

The Desk…West Bengal : బెంగాల్‌ హత్యాచార ఘటన…. ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన గుంపు…. సాక్ష్యాలు చెరిపేందుకేనా..❓

పశ్చిమ బెంగాల్ : THE DESK NEWS : హత్యాచార ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో ఓ జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దీనిని ఖండిస్తూ ‘స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం కోసం’ అంటూ బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆ అమానవీయ ఘటన జరిగిన ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో ఓ గుంపు విధ్వంసం సృష్టించింది. దాంతో ఎమర్జెన్సీ వార్డ్‌ పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు వెల్లడించారు. సాక్ష్యాలను కనుమరుగు చేసేందుకే ఈ దాడికి యత్నించినట్లు అధికార, విపక్ష పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. వైద్యురాలి మృతికి నిరసనగా పిలుపునిచ్చిన ఆందోళనకు మద్దతుగా వైద్యసిబ్బందితో పాటు పలువురు బుధవారం అర్ధరాత్రి ఆసుపత్రి ముందు గుమిగూడారు. అయితే వారితో పాటు కొందరు గుర్తుతెలియని గుంపు ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఆసుపత్రి క్యాంపస్‌పై రాళ్లు రువ్వడంతో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఆ గుంపును నిలువరించేందుకు యత్నించినప్పటికీ వీలుకాలేదని ఓ అధికారి తెలిపారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కోల్‌కతా పోలీస్‌ చీఫ్ వినీత్‌ గోయల్ ఆసుపత్రి వద్దకు వచ్చారు. మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారం కారణంగానే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ‘‘మా బృందంలో ఎవరూ కూడా నిందితులను కాపాడాలని ప్రయత్నించడం లేదు. మేం బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నామని స్పష్టం చేస్తున్నా. ఈవిధంగా సాక్ష్యాలను నాశనం చేయం’’ అని దర్యాప్తుపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు. ఘటన జరిగిన ఆసుపత్రి గది ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైందన్న వార్తలపై కోల్‌కతా పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నేరం జరిగిన సెమినార్ గది వద్దకు ఎవరూ వెళ్లలేదు. ఎలాంటి ధ్రువీకరణ లేని వార్తలను వ్యాప్తి చేయొద్దు. వదంతులు వ్యాప్తి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించింది. ఇదిలాఉంటే.. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని నిరసనకు అవాంతరం కలిగించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తృణమూల్‌ గుండాలను పంపారని భాజపా నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను తెలివిగల వ్యక్తి అని, తన చర్యలను ప్రజలు గుర్తించలేరని భ్రమ పడుతున్నారని విమర్శించారు. సీబీఐకు సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ఈ చర్యకు ఒడిగట్టారని ఆరోపించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ దాడిని ఖండించారు. ఈ హింసకు కారకులైన వ్యక్తులు ఏ పార్టీకి చెందినవారైనా సరే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కోల్‌కతా పోలీసులు ఈ కేసును పరిష్కరించడంలో ఎలాంటి పురోగతి సాధించలేదని వ్యాఖ్యానించిన కోల్‌కతా హైకోర్టు.. దీనిని కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసింది. సాక్ష్యాలు తారుమారు కాకుండా కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని మృతురాలి తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో అభ్యర్థించారు.