🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
ఏలూరు, కొత్తూరులో మూతపడిన జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఏలూరు, కొత్తూరులోని శ్రీకృష్ణ జ్యూట్ మిల్స్ కు చెందిన రెండు యూనిట్లు అకస్మాత్తుగా మూసి వేయటంతో దాదాపు 5వేల మంది కార్మికులు నిరుద్యోగులుగా మారిపోయి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్మిక సంఘాల నేతలు ఇటీవల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
కొద్ది రోజుల క్రితం ఎంపీని కలిసిన కార్మిక ప్రతినిధులు ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) నుంచి తమకు రావాల్సిన నిరుద్యోగ భృతిపై కేంద్రంతో మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి న్యాయం జరిగేట్లు చూస్తానని వారికి ఎంపీ హామీ ఇచ్చారు.
చెప్పిన మాట ప్రకారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆనంతరం మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి, జూట్ మిల్లుల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. వేలాది కార్మిక కుటుంబాల ఆవేదనను, వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరారు.
జూట్ మిల్లులు మూసివేసిన తేదీ నుంచి ఈఎస్ఐ ద్వారా వారికి రావాల్సిన నిరుద్యోగ భృతిని వెంటనే మంజూరు చేయించవలసిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రమంత్రి కోరారు. ఎంపీ విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి మన్సుఖ్ మాండవీయ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
జూట్ మిల్లు కార్మికులకు రావలసిన ఇ.ఎస్.ఐ. అన్ఎంప్లాయిమెంట్ బెనిఫిట్ కోసం ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, ఇతర కార్మిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

