The Desk…Nellore : గ్రామీణ ప్రాంత వాసులకు ప్రభుత్వ సేవలు ఇకపై మరింత సులభతరం : మంత్రి ఆనం

The Desk…Nellore : గ్రామీణ ప్రాంత వాసులకు ప్రభుత్వ సేవలు ఇకపై మరింత సులభతరం : మంత్రి ఆనం

నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :

రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరిచి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా డివిజనల్ అభివృద్ధి అధికారి (డిడిఓ) కార్యాలయాలను ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

గురువారం చిత్తూరు నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 77 డిడివో కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వర్చువల్ గా ప్రారంభించగా, ఆత్మకూరు నుంచి మంత్రి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డిడివో కార్యాలయాన్ని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు.

సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వర్చువల్ గా మాట్లాడుతూ:

రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబునాయుడు గారి ఆమోదం మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అత్యంత వేగవంతంగా సఫలీకృతం చేయడం పట్ల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా డిడివో కార్యాలయాలకు శాశ్వత భవనాలు ఏర్పాటుచేసేలా, ఒకే తరహా డిజైన్లతో భవనాలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు మంత్రి ఆనం సూచించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం కు హామీ ఇచ్చారు.

అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ:

డిడివో కార్యాలయాల ఏర్పాటుతో దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు లేని పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్టవంతమై ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం, విద్యారంగం పరంగా మొదలైన కనీస వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతమవుతాయన్నారు. మండలాల సమస్యలకు డి డి ఓ కార్యాలయం పరిష్కార వేదిక కానుందన్నారు.

డిడివో కార్యాలయాల ఏర్పాటుతో ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు లభించడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆత్మకూరులో తాత్కాలికంగా ప్రభుత్వ భవనంలో డి డి ఓ కార్యాలయాన్ని 11 లక్షలు వ్యయంతో ఫర్నిచర్, ఇతర సామగ్రి సమకూర్చి ఏర్పాటు చేశామని, త్వరలోనే సొంత భవనం నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 50 కోట్ల 48 లక్షలతో 719 పనులు మంజూరు కాగా, కొన్ని పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఉపాధి హామీ నిధులతో 562 సిమెంట్ రోడ్లకు 34 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇతర నిధుల ద్వారా 9 కోట్లతో 156 పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు.

ప్రతి మండలానికి కూడా అదనంగా మరో మూడు కోట్లను రహదారుల నిర్మాణానికి మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరామని, అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 27 కోట్లతో గ్రామాలను అనుసంధానం చేస్తూ ఏడు తారు రోడ్లు మంజూరైనట్లు మంత్రి చెప్పారు.

వీర్ల గుడిపాడు గ్రామానికి రాకపోకలు కల్పించేందుకు బీరా పేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 25 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. దేశానికి వెన్నెముక అయిన గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి, ప్రజలకు ప్రభుత్వ పరిపాలన మరింత సౌలభ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి రమణయ్య, రెవెన్యూ డివిజన్ అధికారి పావని, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.