The Desk…Nellore : సుపరిపాలనే ధ్యేయంగా ఈ నెలలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు : మంత్రి ఆనం

The Desk…Nellore : సుపరిపాలనే ధ్యేయంగా ఈ నెలలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు : మంత్రి ఆనం

  • అన్నదాతలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రైతన్నా మీకోసం

రేపు జిల్లావ్యాప్తంగా డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ప్రారంభం

  • డిడివో కార్యాలయాలతో పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు
  • ఈనెల 5న జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేటిఎం

🔴 నెల్లూరు : ది డెస్క్ :

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళతం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈనెలలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

బుధవారం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పలు ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ:

ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 3వ తేదీ నుంచి రైతన్నా..మీకోసం, ఈనెల 4న అన్ని నియోజకవర్గాల్లో డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాల ప్రారంభోత్సవం, ఈనెల 5న మెగా పేటిఎం కార్యక్రమాలను పండుగవాతావరణంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రైతులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందనే భరోసా కల్పించేందుకు రైతన్నా…మీ కోసం

రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ..పిఎం కిసాన్‌ నిధులను జమచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రైతాంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా వుంటుందని భరోసా కల్పించేందుకు రైతన్నా …మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈనెల 3న రాష్ట్రవ్యాప్తంగా రైతన్నా …మీకోసం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించినట్లు చెప్పారు.

మన జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున త్వరలోనే అన్ని గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పెద్దఎత్తున రైతన్నా మీకోసం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రైతులకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందిస్తూ, వారికి అన్నివిధాల ప్రభుత్వం అండగా వుందని చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా మంత్రి చెప్పారు.

ఈనెల 4న పండుగ వాతావరణంలో డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాల ప్రారంభోత్సవం

గ్రామీణ పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు పాలనను మరింత సులభతరం చేయడం, పంచాయతీరాజ్‌ వ్యవస్థను పర్యవేక్షించే పటిష్టమైన పరిపాలన విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్‌ కేంద్రాల్లో డివిజనల్‌ అభివృద్ధి కార్యాలయాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఈనెల 4న చిత్తూరుజిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ డిడివో కార్యాలయాన్ని ప్రారంభిస్తుండగా, వర్చువల్‌గా జరిగే కార్యక్రమాల్లో స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొంటారని చెప్పారు. ఆత్మకూరులో డిడివో కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొంటునట్లు మంత్రి వెల్లడించారు. నెల్లూరులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యాలయాల ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతంతో పాటు గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కానుందని ఆయన చెప్పారు.

ఈనెల 5న మెగా పేటిఎం

ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేటిఎం (పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌) నిర్వహణకు రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలు జారీచేశారని, ఆ మేరకు జిల్లావ్యాప్తంగా మెగా పేటిఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజర్లలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని, ఆయా నియోజవర్గాల్లో ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి చెప్పారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, విద్యార్థుల ప్రతిభాపాఠవాలు మెరుగుపరిచేందుకు, పాఠశాలల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు

తెలుగుదేశం పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ, గ్రామాల్లో బూత్‌స్థాయిలో పార్టీ స్థితిగతుల గురించి విశ్లేషణ, భవిష్యత్‌లో పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గానికి 8మంది పరిశీలకులను పార్టీ నియమించినట్లు మంత్రి చెప్పారు. బూత్‌స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పారు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు.

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బూత్‌స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఇప్పటి నుంచే దృష్టిపెట్టినట్లు చెప్పారు. క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, భవిష్యత్‌తో చేపట్టాల్సిన కార్యక్రమాలకు కూడా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బూత్‌స్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకుని అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా పునర్విభజన సమస్యలు : మంత్రి ఆనం

జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజుల గడువును ప్రభుత్వం ప్రకటించిందని, ఈలోగా ప్రజలు, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను, సలహాలను మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్తామని, అన్ని విషయాలను కూలంకషంగా చర్చించిన తదుపరి సీఎం చంద్రబాబునాయుడు తుది నిర్ణయం ప్రకటిస్తారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, బొల్లినేని గిరినాయుడు, కేవశ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.