🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
రాష్ట్రంలోని 15 నవోదయ విద్యాలయాల్లో 407 ఉపాధ్యాయ పోస్టులకు గాను, 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు.
దేశంలో ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, గత ఐదేళ్లలో దేశంలో 28 నూతన నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 26 జిల్లాలకుగాను ఏలూరు సహా 13 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఉన్నాయని మిగిలిన జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
13 జిల్లాల్లో ఉన్న15 నవోదయ విద్యాలయాల్లో 407 బోధనా సిబ్బంది, 322 బోధనేతర సిబ్బంది పోస్టులు ఉండగా, 171 బోధనా సిబ్బంది (42%), 155 బోధనేతర సిబ్బంది (48%) పోస్టులు ఖాళీలు ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇంత భారీగా ఖాళీలు ఉండిపోవడం విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బోధనకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియచేశారు.
పాల ధరల నిర్ణయం రాష్ట్రం పరిధిలోనే..
గిరిజన ప్రాంతాల్లో పాల సేకరణ, పాల ధరలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇస్తూ… పాల రాష్ట్రంలో 1,118 గిరిజన గ్రామాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పాల ధరలను స్థానిక సహకార మరియు ప్రైవేట్ డెయిరీ సంస్థలే నిర్ణయిస్తున్నాయన్నారు. ఉత్పత్తి వ్యయం, మార్కెట్ స్థితిగతులను బట్టి ధరలు నిర్ణయించబడుతున్నాయని, కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ (DAHD) వీటిని పర్యవేక్షిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

