- సీఎం సహకారంతో ఏలూరు అభివృద్ధికి బాటలు
- చింతలపూడి ఎత్తిపోతలు, జంగారెడ్డిగూడెం రోడ్డు, ఏలూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఏలూరు ఎంపీ
- గొల్లగూడెంలో పెన్షన్ల పంపిణీ, పీ4 సభల్లో ఎంపీ పిలుపు
- రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబుకి మద్దతుగా నిలుద్దాం
- మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉండాలి
🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :

కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సోమవారం ఉంగుటూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, పీ4 సభల్లో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గొల్లగూడెం ప్రజావేదిక సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు, ఉద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలూ స్వేచ్ఛ, సంతోషాలతో ఊపిరి పీల్చుకుంటున్నారనటంలో సందేహం లేదన్నారు.
తాను ఎంతో అభిమానించే నేత చంద్రబాబు అన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఈ ఏడాది పొగాకు, పామాయిల్, ఆక్వా రైతులకు మంచి ధర ఇప్పించగలిగామన్నారు. పొగాకు రైతులకు అత్యధికంగా కేజీకి రూ. 460, ఆయిల్ పామ్ కు క్వింటాలుకు 19,000 పైగా ధర లభించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలే కారణమన్నారు. ఆలాగే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆక్వా రైతులు సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపుతున్న ముఖ్యమంత్రికి, మంత్రి నారా లోకేష్ కి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని కొన్ని ప్రధాన సమస్యలను, ప్రజల కోరికలను, సమస్యలను పుట్టా మహేష్ కుమార్ ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఎంపీ, ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా విస్తరించవలసిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఏలూరు పట్టణ ప్రజల చిరకాల కోరికగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు డిమాండ్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ఏలూరు జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో నూజివీడులో ఇప్పటికే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వచ్చిందని, మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో 13 ఆర్వోబీలకు అనుమతులు తీసుకువచ్చామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,900 కోట్లు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు.
ఇలాంటి ప్రభుత్వాన్ని నిరంతరాయంగా కనీసం మరో 20 ఏళ్లు కొనసాగిస్తే మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా మారుతుందన్న ఎంపీ, ఇతరుల చేతికి అధికారం ఇచ్చి రాష్ట్రం కష్టాల్లో పడిన తర్వాత ప్రజలకు చంద్రబాబు గుర్తుకు వస్తారని, ఇది కరెక్టు కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం, వచ్చే తరాల గురించి కూడా ఆలోచిస్తూ నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబుకి ప్రజలంతా మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.
నెత్తిపై ముద్దులు పెట్టి మోసపు మాటలు చెప్పే పార్టీల ఉచ్చులో పడకుండా, చంద్రబాబు గారికి మద్దతుగా నిలిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి మన పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 27 ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
సభ చివరిలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు ఎంపీ లేవనెత్తిన విషయాలపై స్పందించారు. ఎంపీ కోరినట్లు చింతలపూడి ఎత్తిపోతలు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా మార్చే పని ఢిల్లీ లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సాధిస్తాడానే నమ్మకం తనకు ఉందని, తాను కూడా రాష్ట్రం తరపున కేంద్రాన్ని కోరుతానని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పేర్కొనటం విశేషం.
గొల్లగూడెం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, డా. కామినేని శ్రీనివాస్, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపి భవన నిర్మాణ కార్మిక, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ ఇతర నేతలు పాల్గొన్నారు.

