- ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న విత్తన పంట బకాయిలు ఇప్పించి రైతులను ఆదుకోవాలి..
- 2025 విత్తన చట్టం ముసాయిదా రైతులకు నష్టం.. రైతులకు అనుకూల విత్తన చట్టం తేవాలి.
- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్..
ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : ది డెస్క్ :
మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి ద్వారకాతిరుమల మండలం హనుమాన్ గూడెం మొక్క జొన్న విత్తన రైతులకు విత్తన పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని, రైతులు అనుకూలమైన విత్తన చట్టం తేవాలని, విత్తన కంపెనీ నుండి రైతులకు అగ్రిమెంట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం – ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన రైతులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మాకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాల్ గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని వారికి న్యాయం చేయాలని కోరారు.
తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2025 విత్తన చట్టం ముసాయిదా కార్పొరేట్ కంపెనీ లకు లాభాలు కట్టబెట్టేది గా ఉందన్నారు. రైతులకు అనుకూలమైన విత్తన చట్టం తీసుకురావాలని కోరారు. ప్రస్తుత విత్తన మొక్కజొన్న పంట సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కంపెనీల నుండి రైతులకు అగ్రిమెంట్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు గంటా పాపారావు, పాలేటి సుభాష్ చంద్రబోస్, గుర్రం పాపారావు, మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులు వీరవల్లి శివ నాగరాజు, వీరవల్లి మోహనరావు, వీరవల్లి వీర వెంకట్రావు,తదితరులు పాల్గొన్నారు.

