- ధాన్యం కొనుగోలు సమస్యతో రైతు ఇక్కట్లు
- సమాచారం అందిన వెంటనే మంత్రి ఎంట్రీ.
- కదిలిన యంత్రాంగం…ఒక్క రోజులో సమస్య పరిష్కారం
- ఆశ్చర్యం, ఆనందంలో రైతాంగం
🔴 కృష్ణాజిల్లా : భట్లపెనుమర్రు గ్రామం/ మొవ్వ : ది డెస్క్ :
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతు సమస్యల పరిష్కారంపై తనదైన ముద్ర వేశారు. మంత్రి తీసుకున్న చొరవకు యావత్ గ్రామం మొత్తం ఆశ్చర్యంలో తలమునకలైందంటే అతిశయోక్తి కాదు. కృష్ణాజిల్లా, మొవ్వమండలం, భట్లపెనుమర్రు గ్రామంలో ఒక చిన్న రైతు తాను పండించిన ధాన్యం అమ్ముకునే ప్రక్రియలో అధికారుల సహాయసహకారాలు లభించక నిన్న తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. కోతకోసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలి? అనే ఆలోచనలతో అటూ, ఇటూ తిరుగారు.
ఈ క్రమంలో తన కష్టాన్ని ఒక వ్యక్తికి చెప్పుకున్నారు. సదరు వ్యక్తి రైతు కష్టాన్ని మంత్రి టీమ్ సభ్యులకు చేరవేశారు. ఈ విషయం ఈరోజు ఉదయం మంత్రి దృష్టికి వాట్సాప్ ద్వారా వెళ్లింది. ఈరోజు ఉదయం 10:15నిమిషాలకు సదరు రైతుకు నేరుగా మంత్రి నుండి ఫోన్…దెబ్బకు రైతు ఖంగుతిన్నాడు. నాకు మంత్రిగారు ఫోన్ చేయడం ఏంటి? అని ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే…..
జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మించిన గ్రామం భట్లపెనుమర్రు గ్రామం. ఈ గ్రామానికి చెందిన చలసాని చంటిబాబు అనే చిన్న రైతు 14ఎకరాల్లో వరి పండించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటను మెషీన్లతో కోయించడం ప్రారంభించారు.
నిన్న సుమారు 7 ఎకరాల పంట కోయించి, ధాన్యాన్ని ఇంటికి తరలించుకున్నారు. ధాన్యాన్ని రైతు సేవా కేంద్రానికి చేరవేస్తానని, దానిని కొనుగోలు చేయాలని అడగ్గా…గ్రామ వ్యవసాయ సహాయక ఉద్యోగి ప్రస్తుతానికి గోనె సంచులు లేవని జవాబిచ్చారు. లారీలు కూడా రావడం లేదని సమయం పడుతుందని సూచించారు. రైతుకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో తన సమస్యను పంచుకుని బాధపడ్డారు.
ఈ విషయం ఏదో ఒక విధంగా మంత్రిగారి టీమ్ దృష్టికి చేరింది. మంత్రికి ఈ రైతు సమస్య ఈ రోజు ఉదయం వాట్సాప్ ద్వారా చేరింది. రైతు వివరాలన్నీ మంత్రి పరిశీలించి…సదరు రైతు చలసాని చంటిబాబుకి మంత్రే స్వయంగా ఫోన్ చేశారు. మీ సమస్య ఏంటి అండి? అని అడిగారు. రైతు తన గోడు మొత్తం వెళ్లబుచ్చారు. మీరు అధైర్యపడొద్దు..మీకు నేను ఉన్నానని మంత్రిగారు భరోసా ఇచ్చారు.
మంత్రి మాట్లాడిన అరగంటలో జిల్లా యంత్రాంగం మొత్తం సదరు రైతు చలసాని చంటిబాబుగారికి వరుసగా ఫోన్లు చేసి సార్ మీ దగ్గరకు వస్తున్నాం…మీ ధాన్యం మొత్తం మేము కొంటాం అని చెప్పడం ప్రారంభించారు. మండల తహసీల్దార్ ఆగమేఘాల మీద గ్రామానికి చేరుకుని రైతు పంట, కావాల్సిన గోనె సంచుల వివరాలు మొత్తం తెలుసుకుని ఈరోజే ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టారు.
మంత్రికి తన కష్టాన్ని చెప్పుకున్నానని….అధికారులే తన దగ్గరకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సాటి రైతులకు సదరు రైతు చంటిబాబు చెప్పడం….అధికారులు తన వద్దకు వచ్చి ఇస్తున్న మర్యాదను చూసి గ్రామంలోని రైతాంగం మొత్తం ఆశ్చర్యంలో తలమునకలయ్యారు. ఇదంట్రా బాబు…..గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు ఇలా వణికిపోతున్నారంటూ ఒకరికొకరు చర్చించుకోవడం మొదలైంది.
ఒక సామాన్య రైతు తన కష్టాన్ని మంత్రికి చెబితే…సమస్య ఇలా గంటల వ్యవధిలో పరిష్కారం అయిపోతుందనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంత్రిగారి చొరవను అభినందిస్తున్నారు. తమకు ఏ కష్టం వచ్చినా మంత్రిగారు ఉన్నారనే ధైర్యంతో పంటలను ధైర్యంగా కోపిస్తున్నారు. తన కష్టం ఇట్టే పరిష్కారం అవ్వడంతో రైతు చలసాని చంటిబాబు ఆశ్చర్యంలో, ఆనందంలో తలమునకలవుతున్నారు.
మంత్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను….– చలసాని. చంటిబాబు, రైతు
మంత్రి నాదెండ్ల మనోహర్ నాకు ఫోన్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. నేను మంత్రిని మాట్లాడుతున్నాను అనగానే నా ఆనందానికి అవధులు లేవు. నా కష్టం మొత్తం మంత్రిగారికి చెప్పిన తర్వాత…మంత్రి ఇచ్చిన ధైర్యాన్ని మాటల్లో చెప్పలేను. ఏ కష్టం ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పండి…మీకు నేనున్నానంటూ ఒక మంత్రి నాలాంటి చిన్న రైతుకు భరోసా ఇవ్వడం గతంలో మా గ్రామంలో జరగలేదు. జిల్లా అధికారులు, మండల అధికారులు, గ్రామ అధికారులు మొత్తం నా దగ్గరకు వచ్చి నా ధాన్యం మొత్తం కొంటామని నాకు అండగా నిలిచారు. నిన్నటి వరకు నా ధాన్యం ఎలా అమ్ముకోవాలి అనే బాధతో, దిగులుతో ఉన్నాను. 24గంటలు తిరిగేలోపు నా ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందంటే నమ్మలేకపోతున్నాను. నా సమస్యపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఏమిచ్చినా రుణం తీరదు. మా కుటుంబం తరపున, మా గ్రామం తరపున మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
చలసాని.చంటిబాబు,
భట్లపెనుమర్రు గ్రామం రైతు
పామర్రు నియోజకవర్గం కృష్ణ జిల్లా
మొబైల్ : 8309845680

