The Desk…Mudinepalli : అన్నదాతా.. సుఖీభవ, పి. ఎం. కిసాన్ పథకం రెండవ విడతలో జిల్లాలో 1,60,968 మంది రైతుల ఖాతాలకు రూ.106. 23 కోట్లు సొమ్ము జమ : మంత్రి నాదెండ్ల

The Desk…Mudinepalli : అన్నదాతా.. సుఖీభవ, పి. ఎం. కిసాన్ పథకం రెండవ విడతలో జిల్లాలో 1,60,968 మంది రైతుల ఖాతాలకు రూ.106. 23 కోట్లు సొమ్ము జమ : మంత్రి నాదెండ్ల

  • విత్తనాలు నుండి విక్రయం వరకు ప్రతీ రైతు వెన్నంటి ఉండి భరోసా కల్పిస్తాం..
  • సాగులో రైతు సమస్యలు ముందుగానే తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం..
  • 4వేల రైతు సేవా కేంద్రాలు, 16వేల సిబ్బందితో రైతుల కళల వద్దకే వెళ్లి ధాన్యం సేకరిస్తున్నాం..
  • ధాన్యం సేకరించిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో సొమ్ము జమ..
  • ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము..సాగులో యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తున్నాం..

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

తమది రైతు ప్రభుత్వమని విత్తనం నుండి విక్రయం వరకు అన్ని విధాలా రైతు వెన్నంటి ఉండి భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముదినేపల్లిలో పచ్చని పొలాల మధ్య పండగ వాతావరణంలో బుధవారం జరిగిన అన్నదాతా సుఖీభవ.. పీఎం కిసాన్ పధకం రెండవ విడత కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి లతో కలిసి నమూనా చెక్కును మంత్రి రైతులకు అందజేశారు.

సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..

ఏలూరు జిల్లాలో అన్నదాతా సుఖీభవ, పి. ఎం. కిసాన్ పధకం రెండవ విడతలో 1,60,968 మంది రైతుల ఖాతాలకు రూ.106. 23 కోట్లు జమచేశామన్నారు. అన్నదాతా సుఖీభవ,పి. ఎం. కిసాన్ పధకంలో సంవత్సరానికి 20 వేల రూపాయలను మూడు విడతలుగా అందించడం జరుగుతుందని, దీనిలో 14 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, 6 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని కొన్ని కులాలు, తమ పార్టీ వారికే అందించిందన్నారు. తమ ప్రభుత్వం సాగుచేస్తున్న రైతుని అర్హతగా చూసి అన్నదాతా సుఖీభవ, పి. ఎం. కిసాన్ పధకాన్నీ కుల,మత, రాజకీయాలకు అతీతంగా, ముఖ్యంగా కౌలు రైతులకు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నామన్నారు.

జీఎస్టీ చెల్లింపుదారులైన రైతులకు కూడా అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని అందిస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. మొంతా తుఫాన్ కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వం 29 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరిస్తే, గత సంవత్సరం 12 వేల 800 కోట్ల విలువైన 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి, 24 నుండి 48 గంటలలోగా నగదును వారి ఖాతాలకు జమచేశామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మెందుకు వాట్సాప్ ద్వారా తమ దగ్గరలోని రైస్ మిల్లులు తెలుసుకోవడం, రైతుకు అనువైన మిల్లులో అమ్మడం వంటి వెసులుబాటు కల్పించామన్నారు.

ప్రస్తుత వ్యవసాయ సీజన్లల్లో రాష్ట్రంలోని 4 వేల రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు 16 వేల మందిని సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. గత వ్యవసాయ సీజన్లో రైతులకు 50 వేల టార్పాలిన్లు 50 శాతం సబ్సిడీ పై అందించామని, ప్రస్తుతం రైతులకు పూర్తి సబ్సిడీ తో టార్పాలిన్లు అందిస్తున్నామని, వీటిలో కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

గత ప్రభుత్వ సమయంలో రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా పర్యటించి, ఆయా రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున తన స్వంత సొమ్ము 5 కోట్ల రూపాయలు అందించారని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 42 రైతు కుటుంబాలకు కూడా లక్ష రూపాయలు చొప్పున అందించారన్నారు. సాగులో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను ముందుగానే తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. జిల్లాలో లక్షా 60 వేల 968 మంది రైతులకు 106. 23 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని రైతాంగానికి రెండు విడతలలో 12 కోట్ల రూపాయలు అందించామన్నారు. జిలాల్లో 5. 41 లక్షల ఎకరాలలో ఈ-పంట నమోదు పూర్తిచేశామని, పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాల ద్వారా నూతన యాజమాన్య పద్దతులతో తక్కువ దిగుబడితో అధిక రాబడి అందించేలా రైతులకు అవగాహన కలిగిస్తున్నారని, ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలో 66 వేల ఎకరాలలో ప్రకృతి సాగు చేస్తున్నారన్నారు. ఏలూరు జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్ధేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

జిల్లాలో ఫైన్ రకం వరి సాగును 20 వేల ఎకరాలలో చేపట్టామన్నారు. యాంత్రీకరణలో భాగంగా 60 డ్రోన్లను రైతులకు మంజూరుచేశామని, వీటిలో 52 డ్రోన్లను రైతులకు అందించామన్నారు. జిల్లాలో 75 వేల మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు అందించి సాగుకు రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుత సీజన్లో జిల్లాలో 4. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ చెప్పారు.

కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..

దేశానికీ అన్నం పెడుతున్న రైతుకు ఎంతచేసినా తక్కువేనని, రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కైకలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వం డ్రైన్లను ప్రక్షాళన చేయని కారణంగా చిన్నపాటి వర్షానికి పంటలు దెబ్బతినేవన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మొంతా తుఫాన్ కారణంగా పంటలకు తక్కువ నష్టం కలిగిందన్నారు.

ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలుచేస్తున్నదని, ధాన్యం సేకరించిన 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు సొమ్ము జమచేశారని, గత సీజన్లో కొంతమంది రైతులకు కేవలం 4 గంటల్లోనే సొమ్ము జమ అయిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో ముందుకు తీసుకువెళుతున్నారన్నారు.

కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మూర్తి, ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్, రైతు సంఘాల నాయకులు ప్రభృతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ని రైతు సంఘాల నాయకులూ గజమాలతో సత్కరించారు. అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవ శాఖ ఏర్పాటుచేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రి నాదెండ్ల మనోహర్ తిలకించారు.